Mahaa Daily Exclusive

  తెలంగాణ ప్రగతి పద్దు 2026-27: ఆరు గ్యారెంటీలకు అక్షరాలా రూ. 50,713 కోట్లు.. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుతో రేవంత్ సర్కార్ ‘సువర్ణ అధ్యాయం’!

Share

సబ్బండ వర్గాల సంక్షేమమే మహా సంకల్పంగా..
* రేవంత్ సర్కార్ చారిత్రాత్మక వార్షిక పద్దు!
* ఆరు హామీల అమలుకు అక్షరాలా రూ. 50,713 కోట్ల కనకవర్షం!
* దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో.. ప్రతి ఇంటికి రూ. 5 లక్షల జీవిత బీమా ధీమా!
* చదువుల తల్లికి మహర్దశ.. విద్యార్థులకు ఉదయం అల్పాహారం.. మధ్యాహ్నం కడుపునిండా భోజనం!
* అన్నదాతకు ఆపద్బాంధవుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం.. వ్యవసాయ రంగానికి రూ. 23,179 కోట్లు!
* నిరుపేదల ఇళ్లల్లో పండుగ వెలుగులు.. కొత్తగా 2,00,000 ఆసరా పింఛన్ల మంజూరు!
* రాష్ట్ర బడ్జెట్ అక్షరాలా రూ. 3,24,234 కోట్ల.

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో సరికొత్త సువర్ణ అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల బతుకుల్లో వెలుగులు నింపేలా శాసనసభ వేదికగా పాలకుల దార్శనికత ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సరపు వార్షిక పద్దు పారదర్శక పాలనకు నిలువెత్తు అద్దం పడుతోంది. అక్షరాలా రూ. 3,24,234 కోట్ల భారీ అంచనాలతో రూపొందించిన ఈ పద్దు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గత పాలకుల విధ్వంసకర విధానాలతో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక పక్క గాడిలో పెడుతూనే ఇంకో పక్క సంక్షేమ ఫలాలు ప్రతి గడపకూ చేరేలా ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు సర్వత్రా ప్రశంసలందుకుంటున్నాయి. రెవెన్యూ వ్యయం కింద రూ. 2,34,406 కోట్లు ప్రతిపాదించగా మూలధన వ్యయం కింద రూ. 47,267 కోట్లు కేటాయించి అభివృద్ధి సంక్షేమాలకు సమతుల్యత పాటించారు. ప్రతి పౌరుడికి ఆర్థిక సామాజిక న్యాయం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఈ పద్దు స్పష్టం చేస్తోంది. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా సకల జనుల సంతోషమే పరమావధిగా అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా ఈ చారిత్రాత్మక ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి.

*సంక్షేమ సునామీ.. అభివృద్ధి అశ్వమేధం*

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వార్షిక పద్దు రాష్ట్ర చరిత్రలో ఒక చెరగని ముద్ర వేయబోతోంది. మునుపెన్నడూ లేని విధంగా అత్యంత శాస్త్రీయంగా వాస్తవిక దృక్పథంతో ఈ అంచనాలను రూపొందించారు. గత ఆర్థిక సంవత్సరపు కేటాయింపులకంటే పది శాతం అదనపు పెరుగుదలతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేశారు. కేవలం అంకెలు గారడీ కాకుండా అట్టడుగు వర్గాలకు ప్రతి రూపాయి చేరేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిపాలనలో పారదర్శకతను పెంచుతూ వృథా ఖర్చులకు కళ్లెం వేస్తూ కూడబెట్టిన ప్రతి పైసాను పేదల సంక్షేమానికే వెచ్చించాలన్న రేవంత్ రెడ్డి సర్కార్ దృఢ సంకల్పం ఈ పద్దులో ప్రతిఫలించింది. విద్య వ్యవసాయం లాంటి అత్యంత కీలకమైన రంగాలకు కనీవినీ ఎరుగని రీతిలో నిధుల వరద పారించారు. సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రామాణికంగా సాగిన ఈ ప్రతిపాదనలు ప్రతిపక్షాల విమర్శల నోళ్లు మూయించాయి.

*ఆరు హామీల అమలే మహా యజ్ఞం*

ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే పాలకుల ప్రథమ కర్తవ్యంగా ఈ పద్దు రూపుదిద్దుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆరు హామీల అమలు కోసం ఏకంగా రూ. 50,713 కోట్లు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం తన నిబద్ధతను నిరూపించుకుంది. సమాజంలో అత్యంత ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు కొండంత అండగా నిలిచే ఆసరా పింఛన్ల కోసమే అత్యధికంగా రూ. 14,861 కోట్లు కేటాయించడం పేదల పట్ల పాలకులకు ఉన్న అపారమైన ప్రేమకు ప్రతీక. సొంతింటి కల నెరవేర్చుకునే నిరుపేదల కోసం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ. 5,500 కోట్లు వెచ్చించనున్నారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపే గృహజ్యోతి పథకానికి రూ. 2,080 కోట్లు కేటాయించారు. వంట గ్యాస్ సబ్సిడీ కోసం రూ. 723 కోట్లు కేటాయించి సగటు గృహిణి కష్టాలు తీర్చే మహత్తర బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సాయం అందించే కల్యాణ లక్ష్మి పథకానికి కేటాయించిన రూ. 3,683 కోట్లు పేద కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారనున్నాయి.

*అభాగ్యులకు ఆసరా.. కొత్తగా రెండు లక్షల పింఛన్లు*

ఎంతో కాలంగా సామాజిక భద్రత కోసం నిరీక్షిస్తున్న అభాగ్యుల పాలిట ఈ ప్రభుత్వం కల్పతరువుగా మారింది. గత ప్రభుత్వాల హయాంలో పింఛన్ల కోసం చెప్పులరిగేలా తిరిగినా ప్రయోజనం శూన్యం కాగా ప్రస్తుత ప్రభుత్వం వారి కన్నీళ్లు తుడిచేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఏకంగా 2,00,000 మంది లబ్ధిదారులకు కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి పేదల గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకుంది. ఈ నిర్ణయంతో సుమారు రెండు లక్షల నిరుపేద కుటుంబాల్లో శాశ్వత వెలుగులు నిండనున్నాయి. ఎటువంటి పైరవీలకు తావులేకుండా అర్హతే ప్రామాణికంగా ఈ పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ ఒక్క నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సామాన్యుల ఆశాజ్యోతిగా నిలబెట్టింది.

*ప్రాణదాత రేవంత్.. ప్రతి గడపకూ ఉచిత బీమా ధీమా*

ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా నిలిచేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని వినూత్న పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక కుటుంబానికి ఆదాయం తెచ్చే ప్రధాన వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదన్న ఉత్కృష్టమైన ఆలోచనతో ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పేరిట మహాద్భుత పథకాన్ని ఆవిష్కరించింది. రాబోయే జూన్ రెండు నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5,00,000 ఉచిత జీవిత బీమా రక్షణ లభించనుంది. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం పునర్జన్మ ప్రసాదించనుంది. ఈ పథకం పాలకుల మానవతా దృక్పథానికి నిదర్శనంగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పరిణామం.

*విద్యార్థుల పాలిట వరం.. చదువుల తల్లికి స్వర్ణయుగం*

విద్యా దీపమే జాతికి వెలుగునిస్తుందన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం విద్యా రంగానికి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 26,674 కోట్లు కేటాయించింది. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం అంగన్వాడీ స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని తీర్మానించింది. ఉదయం పూట అల్పాహారం అందించడంతో పాటు విద్యార్థులకు వారంలో మూడు రోజులు పాలు తక్కిన మూడు రోజులు రాగి జావ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం వారి శారీరక మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడనుంది. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల భోజన ఖర్చుల కోసం రూ. 2,170 కోట్లు ఉపకార వేతనాల కోసం రూ. 4,343 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యా సంస్థల్లో చదివే యువతకు నెలకు రూ. 2,000 ఉపకార వేతనం అందించే అద్భుత ప్రతిపాదన యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

*ఆరోగ్య తెలంగాణే పరమావధి.. సాంకేతిక కార్డుల విప్లవం*

పేదవాడికి అత్యున్నత స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖకు రూ. 13,679 కోట్లు ప్రతిపాదించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాది వేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 1,143 కోట్లు కేటాయించి ప్రాణదాతగా నిలిచారు. పాలకులపై నమ్మకంతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేరుస్తూ నగదు రహిత వైద్య సేవలు అందించే ఆరోగ్య పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వైద్య కళాశాలల నిర్మాణం వేగవంతం చేయడంతో పాటు కొత్తగా 3 వైద్య కళాశాలలు పదహారు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలందరికీ సాంకేతిక ఆరోగ్య గుర్తింపు కార్డులు జారీ చేసి ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు.

*అన్నదాతకు కొండంత అండ.. వ్యవసాయానికి ప్రాణం*

దేశానికే అన్నంపెట్టే రైతన్న కంటతడి పెట్టకూడదన్న పవిత్ర ఆశయంతో వ్యవసాయ రంగానికి ఏకంగా రూ. 23,179 కోట్లు కేటాయించి కర్షక పక్షపాతిగా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది. సాగును పండుగలా మార్చేందుకు ఉద్దేశించిన రైతు భరోసా పథకానికి అక్షరాలా రూ. 18,000 కోట్లు కేటాయించడం అన్నదాతల్లో ఆనందోత్సాహాలు నింపుతోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ఉద్దేశంతో సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 అదనపు ప్రోత్సాహకం అందించేందుకు రూ. 3,500 కోట్లు కేటాయించారు. నిరుపేదల ఆకలి తీర్చే సబ్సిడీ బియ్యం పంపిణీ కోసం అత్యధిక నిధులు కేటాయించి సగటు జీవికి అభయమిచ్చారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు పశుసంవర్ధక శాఖకు రూ. 1,529 కోట్లు కేటాయించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించారు.

*మహాలక్ష్ములకు పెద్దపీట.. ఉచిత ప్రయాణానికి మహా పద్దు*

మహిళా సాధికారతే రాష్ట్ర ప్రగతికి మూలస్తంభం అని నమ్మిన రేవంత్ సర్కార్ మహిళల సంక్షేమం కోసం దండిగా నిధులు కేటాయించింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రూపొందించిన మహాలక్ష్మి పథకానికి ఏకంగా రూ. 4,308 కోట్లు కేటాయించారు. గత రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వ బస్సుల్లో మహిళలు దాదాపు 280 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయడం ఈ పథకం సాధించిన అద్భుత విజయానికి తిరుగులేని సాక్ష్యం. మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 3,143 కోట్లు కేటాయించి అబలలకు సబలలుగా మారే అవకాశం కల్పించారు. ఆడబిడ్డల చదువుల నుంచి మొదలుకొని వారి వివాహాల వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం ఒక తండ్రిలా అండగా నిలబడుతోందనడానికి ఈ ఆర్థిక కేటాయింపులే సజీవ నిదర్శనం.

*పల్లె సీమలకు జీవం.. మౌలిక వసతులకు కనకవర్షం*

గ్రామాల అభివృద్ధే దేశాభివృద్ధికి నాంది అన్న మహాత్ముని మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ పంచాయతీరాజ్ శాఖకు కళ్లు చెదిరేలా రూ. 33,688 కోట్లు కేటాయించారు. ప్రతి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. సాగునీటి ప్రాజెక్టుల పునరుజ్జీవనం దార్శనికతతో నీటిపారుదల శాఖకు రూ. 22,615 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రమంతటా నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖకు రూ. 21,285 కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధి శాఖకు రూ. 17,907 కోట్లు రహదారుల నిర్మాణానికి ఏకంగా రూ. 12,789 కోట్లు కేటాయించి పల్లె పట్టణం అన్న తేడా లేకుండా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు విస్తృతమైన ప్రణాళికలు రచించారు.

*సబ్బండ వర్గాలకు సమన్యాయం.. గోదావరి పుష్కరాలకు సన్నద్ధం*

అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దళిత గిరిజన వెనుకబడిన మైనార్టీ వర్గాలకు సమన్యాయం చేస్తూ నిధుల కేటాయింపులు జరిపింది. దళిత వర్గాల అభ్యున్నతికి రూ. 11,784 కోట్లు గిరిజన సంక్షేమానికి రూ. 7,937 కోట్లు కేటాయించి వారి జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావాలని సంకల్పించింది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రూ. 3,769 కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ. 3,769 కోట్లు ప్రతిపాదించింది. హిందూ సంప్రదాయాలను సమున్నతంగా గౌరవిస్తూ వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ప్రతిష్టాత్మక నిర్వహణకు రూ. 500 కోట్లు కేటాయించారు. పుష్కరాలకు రాబోయే ఎనిమిది కోట్ల మంది భక్తుల కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి అత్యున్నత స్థాయి ఏర్పాట్లు చేయనున్నారు. సకల జనుల సంక్షేమమే ఊపిరిగా రూపుదిద్దుకున్న ఈ వార్షిక పద్దు పాలకుల చిత్తశుద్ధికి నిలువెత్తు దర్పణంగా నిలిచిపోతుంది.

Latest