Mahaa Daily Exclusive

  ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్ రెడ్డి విశ్వరూపం…..

Share

* 6 వేల ఫోన్లు ట్యాప్ అయ్యాయి.. ఏ విచారణకైనా మేం సిద్ధం!
* హరీష్ రావు ప్రచారం అబద్ధం.. ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నాం.
* విచారణ లేకుండా అరెస్టులు ఉండవు..
* చట్టబద్ధంగానే ఫోన్ ట్యాపింగ్ నిందితుల వేట.
* ముఖ్యమంత్రి రేవంత్ హెచ్చరిక!

హైదరాబాద్, మహా.

తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం ఒక పక్కా వ్యూహం , చట్టబద్ధమైన ప్రాసెస్ ప్రకారమే ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే సరైన విచారణ , ఆధారాలు ఉండాలని, విచారణ పూర్తి కాకుండా ఎవరినీ అడ్డగోలుగా అరెస్ట్ చేయలేమని ఆయన ఉద్ఘాటించారు. ఈ విచారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడే అనుమతులు లభించాయని, దీని ఆధారంగా విచారణ మరింత వేగవంతం అవుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక అధికారి అరవింద్ కుమార్‌ను సస్పెండ్ చేశామని గుర్తు చేస్తూ, తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ప్రధానంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక సమాచారాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నామని, ఈ కేసులో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని హరీష్ రావు చేసుకుంటున్న ప్రచారం కేవలం అసత్యమని ఆయన కొట్టిపారేశారు. పంజాగుట్టలో నమోదైన ఒక ప్రైవేట్ కేసులో మాత్రమే ఆయనకు ఉపశమనం లభించిందని, అంతమాత్రాన ఫోన్ ట్యాపింగ్ కేసులో క్లీన్ చిట్ వచ్చినట్లు కాదని ముఖ్యమంత్రి వివరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
గత పదేళ్ల పాలనలో, అంటే 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు దాదాపు 6 వేల ఫోన్లను ట్యాప్ చేశారనే సంచలన విషయాన్ని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా, ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలి పెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ మరియు హరీష్ రావు ఏ విధమైన విచారణ కోరినా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తాము ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని సవాల్ విసిరారు. పారదర్శకమైన విచారణ ద్వారా వాస్తవాలను వెలికి తీసి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

Latest