పిల్లల ఆరోగ్యంపై గ్రామస్థుల ‘సర్జికల్ స్ట్రైక్’. * ఐస్ క్రీం బండ్ల రాకపై కఠిన నిషేధం!
* వస్తే ఐస్ క్రీం.. వెళ్తే రూ.5,000 జరిమానా.
* గూడూరు పొలిమేరల్లో వెలిసిన హెచ్చరిక బోర్డులు!
* కల్తీ ఐస్ క్రీంల అడ్డుకట్టకు ఒక పల్లెటూరు సాహసోపేత నిర్ణయం!
హైదరాబాద్, మహా.
**మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, కానీ ఆ అలవాట్లు మన తర్వాతి తరం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయనే చేదు నిజాన్ని గూడూరు గ్రామస్థులు గుర్తించారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు రంగురంగుల ఐస్ క్రీంలతో వచ్చే ఆటోలు, బండ్లు పిల్లలను ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఐస్ క్రీంలలో వాడే రసాయనాలు, కల్తీ పదార్థాల వల్ల తమ పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని గమనించిన ఆ గ్రామ పెద్దలు, యువత కలిసి ఒక ఐక్యమత్య నిర్ణయానికి వచ్చారు. కేవలం మాటలతో కాకుండా, ఏకంగా జరిమానాలు విధిస్తూ గ్రామంలోకి ఐస్ క్రీం విక్రయదారుల ప్రవేశాన్ని అడ్డుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది**
సాధారణంగా గ్రామ సరిహద్దుల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు లేదా పండుగ శుభాకాంక్షల బ్యానర్లు కనిపిస్తాయి. కానీ చింతూరు మండలం గూడూరు గ్రామ పొలిమేరల్లో మాత్రం వినూత్నమైన హెచ్చరిక బోర్డులు దర్శనమిస్తున్నాయి. “మా గ్రామంలోకి ఐస్ క్రీమ్ ఆటోలకు మరియు ఐస్ క్రీమ్ బండ్లకి ప్రవేశము లేదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి గ్రామంలోకి వస్తే రూ. 5,000 జరిమానా విధించబడును” అనే స్పష్టమైన సందేశంతో ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామంలోకి వస్తున్న ఐస్ క్రీం బండ్లలో నాణ్యత లేని, కల్తీ ఐస్ క్రీంలను విక్రయిస్తున్నారని, వాటిని తిన్న పిల్లలకు పంటి సమస్యలు, కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులు వాడే ఐస్ క్రీంలలో పాలు లేదా నాణ్యమైన పదార్థాలకు బదులుగా హానికరమైన రంగులు, రసాయనాలు వాడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని కొందరు పిల్లలు వరుసగా అనారోగ్యానికి గురికావడంతో గ్రామ పంచాయతీ మరియు పెద్దలు సమావేశమై ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది కేవలం తాత్కాలిక నిర్ణయం కాదని, పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న బాధ్యతాయుతమైన అడుగు అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ గ్రామం గతంలో అక్రమ మద్యం అమ్మకాలను కూడా అరికట్టి తమ ఐక్యతను చాటుకుంది. ఇప్పుడు ఐస్ క్రీం బండ్ల నిషేధం ద్వారా ప్రజారోగ్యం విషయంలో తాము ఎంత కఠినంగా ఉంటామో మరోసారి నిరూపించారు.
ఈ వినూత్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. “ప్రభుత్వాలు చేసే వరకు వేచి చూడకుండా, తమ గ్రామాన్ని తామే రక్షించుకోవాలనే గూడూరు గ్రామస్థుల ఆలోచన ఆదర్శనీయం” అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు మాత్రం విక్రయదారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని, నిషేధానికి బదులుగా నాణ్యతను తనిఖీ చేసే వ్యవస్థ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, తన సంతానం ఆరోగ్యం కోసం ఒక పల్లె తీసుకున్న ఈ ‘కోల్డ్ వార్’ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇతర గ్రామాల్లో కూడా చర్చకు దారితీస్తోంది.








