జీవన్‌రెడ్డిని వదులుకోం.. పునరాలోచించుకోవాలి!
* కాంగ్రెస్ సీనియర్ నేతతో ముగిసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ భేటీ.
* పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఆయనకు ఇబ్బంది కలిగింది వాస్తవమే.
* అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయన సేవలు కాంగ్రెస్, ఏఐసీసీకి ఎంతో అవసరం.
* పార్టీని వీడొద్దని, నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరామన్న పీసీసీ అధ్యక్షుడు.
జగిత్యాల,మహా.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జగిత్యాలకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.. జీవన్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయనతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఈ కీలక భేటీ ముగిసిన అనంతరం పీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. జీవన్‌రెడ్డి సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అపార అనుభవం ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆయన కొంత ఇబ్బందికి, మనస్తాపానికి గురయ్యారని మహేశ్ కుమార్ గౌడ్ అంగీకరించారు.
సమస్యను పరిష్కరించే దిశగా రెండు రోజుల క్రితమే రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం నేరుగా వచ్చి జీవన్‌రెడ్డిని కలిసి మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందించిన జీవన్‌రెడ్డి లాంటి పెద్ద దిక్కును ఏ పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి రాష్ట్ర నాయకత్వం కానీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కానీ ఏమాత్రం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పార్టీని వీడాలనే ఆలోచన ఏమైనా ఉంటే దానిని తక్షణమే విరమించుకోవాలని, దయచేసి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఈ భేటీలో జీవన్‌రెడ్డిని ప్రత్యేకంగా కోరినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అధిష్ఠానం ఆయనకు తగిన ప్రాధాన్యత, గౌరవం ఇస్తుందని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ స్వయంగా వచ్చి బుజ్జగించడంతో.. జీవన్‌రెడ్డి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.







