కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై!
* రేపు ఉదయం 10 గంటలకు సంచలన ప్రకటన..
* ఇన్నాళ్లు కలిసి ఉండి వీడిపోవడం బాధాకరమే అంటూ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు.
జగిత్యాల,మహా.
దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా, విధేయుడిగా ఉన్న సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అధిష్ఠానం బుజ్జగింపులు బెడిసికొట్టాయి. పార్టీని వీడొద్దంటూ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జగిత్యాలకు వచ్చి జరిపిన మంతనాలు ఏమాత్రం ఫలించలేదు. రాష్ట్ర నాయకత్వంతో భేటీ ముగిసిన అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లడం తనకు కూడా ఎంతో ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తనకు ఎదురైన సమస్య ప్రస్తుతం పరిష్కారం కానిదిగా మారిపోయిందని, దానికి పరిష్కారం వారి (అధిష్ఠానం) వద్ద లేదని, తన వద్ద కూడా లేదని కుండబద్దలు కొట్టారు.
సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ కుటుంబంలో అందరం కలిసి ఉండి, ఇప్పుడు ఇలా వీడిపోవాల్సి రావడం ఎంతో బాధాకరమైన విషయమని జీవన్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నంత పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలన్న కఠిన నిర్ణయానికి తాను మానసికంగా సిద్ధపడినట్లు పరోక్షంగా స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాతే తాను నేరుగా నియోజకవర్గ ప్రజల ముందుకు వెళ్తానని, వారిని కలుస్తానని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత తన తదుపరి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ, నిర్ణయం ఎలా ఉంటుందో తనకు కూడా ఇంకా తెలియదని అన్నారు. కర్మ సిద్ధాంతం తనను ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందేనంటూ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, నిష్కళంకమైన నాయకుడిగా పేరున్న జీవన్‌రెడ్డి పార్టీని వీడుతుండటం అధికార కాంగ్రెస్ పార్టీకి ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేపు ఉదయం ఆయన ఏ పార్టీ కండువా కప్పుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







