Mahaa Daily Exclusive

  మతం మారితే ఎస్సీ హోదా రద్దయినట్లే: పాస్టర్‌కు అట్రాసిటీ చట్టం వర్తించదని సుప్రీంకోర్టు కీలక తీర్పు

Share

మతం మారితే ఎస్సీ హోదా రద్దయినట్లే!
* అట్రాసిటీ చట్టం కింద పాస్టర్‌కు రక్షణ లేదన్న సుప్రీంకోర్టు..
* ఏపీ హైకోర్టు తీర్పు సమర్థన.

ఢిల్లీ, మహా.

హిందూ, బౌద్ధ, సిక్కు మతాల్లో ఉన్నవారికి మాత్రమే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా వర్తిస్తుందని, మరే ఇతర మతంలోకి మారినా ఆ హోదా తక్షణమే రద్దవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా కొనసాగుతున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ (అకృత్యాల నిరోధక) చట్టం కింద రక్షణ పొందలేరని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం పూర్తిస్థాయిలో సమర్థించింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆనంద్ అనే పాస్టర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక తుది ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ అనేదే లేదని, అందువల్ల హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు తప్ప మరే మతంలో ఉన్నవారూ ఎస్సీ వర్గానికి చెందిన సభ్యులు కాలేరని ఏపీ హైకోర్టు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఒక వ్యక్తి మతం మార్చుకున్న వెంటనే అతనికి ఉన్న ఎస్సీ హోదా దానంతట అదే రద్దవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మతం మారిన తర్వాత కూడా పాత కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికెట్) రద్దు కాకుండా వారి వద్దే ఉన్నప్పటికీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద వారికి ఎలాంటి రక్షణా వర్తించదని ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. కేవలం సర్టిఫికెట్ తన వద్ద ఉన్న కారణంతో చట్టపరమైన రక్షణ కల్పించాలని అడగడం సబబు కాదని స్పష్టం చేసింది. పిటిషనర్ అయిన పాస్టర్ ఆనంద్ దశాబ్ద కాలానికి పైగా క్రైస్తవ మతంలోనే కొనసాగుతున్నారని, ఆయన తిరిగి హిందూ మతంలోకి మారలేదని విచారణలో నిరూపితమైందని న్యాయస్థానం తెలిపింది. ఒకవేళ ఎవరైనా తిరిగి మాతృమతంలోకి (హిందూ మతంలోకి) మారి, తిరిగి ఎస్సీల్లో చేరినట్లు ఆధారాలతో నిరూపించుకుంటేనే వారికి ఎస్సీ హోదా పునరుద్ధరించబడుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

Latest