Mahaa Daily Exclusive

  రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ డౌన్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు

Share

సర్వర్ డౌన్..
* రిజిస్ట్రేషన్లు బంద్!
* రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన సేవలు..
* స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులకు బ్రేక్.
* సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు.
హైదరాబాద్, మహా.
రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన సర్వర్లు మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వర్లు పనిచేయక అత్యంత కీలకమైన భూబదలాయింపు, స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు వంటి ప్రక్రియలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని, తమ ఆస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్ల కోసం ఉదయాన్నే ఆయా కార్యాలయాలకు చేరుకున్న వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మంచి ముహూర్తం చూసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుందామని ఎంతో ఆశతో వచ్చిన కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఈ సర్వర్ల సమస్య తీవ్ర నిరాశను మిగిల్చింది. ఉదయం నుంచి గంటల తరబడి పడిగాపులు కాస్తున్నప్పటికీ.. సర్వర్లు ఎప్పుడు పునరుద్ధరించబడతాయో కచ్చితమైన సమాచారం తెలియకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీగా రద్దీ నెలకొంది. మరోవైపు, సాంకేతిక సిబ్బంది సర్వర్ల లోపాన్ని సరిచేసి, సేవలను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు వెల్లడించారు. నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించి త్వరలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను యథావిధిగా ప్రారంభిస్తామని చెబుతున్నారు.

Latest