బరువు తగ్గించే మందులపై కొరడా!
* ప్రచారంపై నిషేధం విధించిన కేంద్రం..
* సరఫరా గొలుసులపైనా డేగకన్ను.
ఢిల్లీ, మహా.
సన్నబడాలనే యావలో ప్రజలు ఇష్టారాజ్యంగా వాడుతున్న బరువు తగ్గించే మందులపై (వెయిట్ లాస్ డ్రగ్స్) కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎలాంటి వైద్యుల పర్యవేక్షణ లేకుండా విచ్చలవిడిగా లభిస్తున్న ఈ ఔషధాల వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. బరువు తగ్గించే మందుల ప్రచారం, ఆకర్షణీయమైన ప్రకటనలపై తక్షణమే నిషేధం విధిస్తూ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల కాలంలో భారత మార్కెట్లోకి బరువును తగ్గించే పలు రకాల జనరిక్ మందులు పెద్ద ఎత్తున ప్రవేశించాయి. ఇవి మెడికల్ షాపులతో పాటు ఆన్లైన్లోనూ ఇబ్బడిముబ్బడిగా లభ్యమవుతుండటంతో ప్రజలు వాటిని సులభంగా కొనుగోలు చేసి వాడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఔషధాల సరఫరాపై డేగకన్ను వేసింది. ఈ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరికి చేరుతున్నాయనే సరఫరా గొలుసులపై (సప్లై చైన్) నిరంతర పర్యవేక్షణ పెంచింది. ఈ వ్యవహారంలో కేంద్రం ఒంటరిగా కాకుండా.. డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, అలాగే అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ సంస్థలతో కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణను అమలు చేస్తోంది. ఈ మందుల తయారీ, పంపిణీ, విక్రయాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఈ ఔషధాలను అంటగట్టే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. తాజా నిర్ణయంతో ఇష్టారీతిన ఈ మందులను విక్రయించే ఫార్మా కంపెనీలు, వ్యాపారులకు గట్టి చెక్ పడినట్లయింది.





