విద్యార్థులకు ఫోన్ వాడకం గంటే!
* డిజిటల్ వ్యసనానికి చెక్ పెట్టేలా కర్ణాటక సర్కారు విప్లవాత్మక ముసాయిదా.
* రాత్రి 7 దాటితే ఫోన్లలో ఇంటర్నెట్ బంద్ అయ్యేలా చైల్డ్ ప్లాన్.
* ఇకపై స్కూళ్లలో వాట్సాప్ వద్దు, డైరీయే ముద్దు.
* ‘డిజిటల్ వెల్బీంగ్’ పేరుతో కర్ణాటక సర్కారు కీలక ప్రణాళిక..
బెంగళూరు,మహా.
ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు స్మార్ట్ఫోన్లకు తీవ్రంగా బానిసలవుతున్న (అడిక్ట్) తీరుపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయాలకు సిద్ధమైంది. ఇంటర్నెట్ వ్యసనం నుంచి పిల్లలను బయటపడేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత విప్లవాత్మకమైన మార్గదర్శకాలతో ఒక ముసాయిదాను (డ్రాఫ్ట్) అధికారికంగా విడుదల చేసింది. ‘డ్రాఫ్ట్ పాలసీ ఆన్ రెస్పాన్సిబుల్ డిజిటల్ యూజ్ అమంగ్ స్టూడెంట్స్’ లేదా ‘డిజిటల్ వెల్బీంగ్ పాలసీ’ పేరుతో కర్ణాటక ఆరోగ్య, విద్యా శాఖలు, నిమ్హాన్స్ తదితర సంస్థలు సంయుక్తంగా ఈ ముసాయిదాను రూపొందించాయి. దీని ప్రకారం.. 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు ప్రతిరోజూ కేవలం ఒక గంట మాత్రమే ఫోన్ చూసేలా కఠిన పరిమితులు విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే, విద్యార్థుల రోజువారీ ప్రోగ్రెస్ గురించి స్కూళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయం చేసుకునేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘వాట్సాప్’ గ్రూపులను రద్దు చేసి, తిరిగి పాతకాలపు ‘స్కూల్ డైరీ’ విధానాన్నే తప్పనిసరి చేయాలని అందులో పొందుపరిచారు.
**వయసును బట్టే కంటెంట్.. రాత్రి 7కే ఇంటర్నెట్ బంద్!**
ప్రస్తుతం 10 నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లల్లో దాదాపు 25 శాతం మంది ఇంటర్నెట్ వ్యసనం బారిన పడి తీవ్రమైన మానసిక ఆందోళన, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పాలసీలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి చెక్ పెట్టేందుకు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లలోనే మార్పులు చేయాలని కర్ణాటక సర్కారు ప్రతిపాదించింది. పిల్లల వయసుకు తగిన కంటెంట్ మాత్రమే కనిపించేలా ఫోన్ల తయారీ జరగాలని, అలాగే రాత్రి 7 గంటలు కాగానే ఆటోమేటిక్గా ఇంటర్నెట్ ఆగిపోయేలా ఫోన్లలో ప్రత్యేకమైన సెట్టింగ్స్ (చైల్డ్ ప్లాన్) ఉండాలని సూచించింది. దీనివల్ల అర్ధరాత్రి దాకా నిద్ర మానుకుని ఫోన్లు చూసే అలవాటు నుంచి పిల్లలను రక్షించవచ్చని పేర్కొంది.
**పాఠ్యాంశంగా డిజిటల్ వెల్బీంగ్.**
బాధ్యతాయుతంగా ఫోన్లను ఎలా ఉపయోగించాలనే దానిపై విద్యార్థులకు పాఠశాల దశ నుంచే అవగాహన కల్పించేలా ‘ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ని కరికులమ్లో చేర్చాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ఆన్లైన్ భద్రత, ప్రైవసీ, డిజిటల్ ఫూట్ప్రింట్స్ తదితర అంశాలపై పాఠాలు బోధించనున్నారు. అలాగే, ప్రతి స్కూల్లోనూ ప్రిన్సిపాల్, కౌన్సిలర్, సైబర్ క్రైమ్ పోలీసులతో కూడిన ‘డిజిటల్ వెల్నెస్ కమిటీ’లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్మార్ట్ఫోన్లకు బానిసలైన పిల్లలను గుర్తించి వారికి కౌన్సిలింగ్, మానసిక వైద్యుల సాయం అందించేలా ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఫోన్లకు బదులు పిల్లలు క్రీడలు, పుస్తక పఠనం, కళల వైపు మొగ్గుచూపేలా ప్రోత్సహిస్తారు. అలాగే, ప్రతి స్కూల్లో కనీసం మూడు నెలలకోసారి ‘టెక్ ఫ్రీ పీరియడ్స్’, ‘ఆఫ్ లైన్ జాయ్ డేస్’ జరపాలని, నవంబర్ నెలను ‘నో టెక్నాలజీ మంత్’గా, డిసెంబర్ 10ని ‘డిజిటల్ డీటాక్స్ డే’గా పరిగణించాలని ముసాయిదాలో స్పష్టం చేశారు. ఇళ్లలోనూ తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇచ్చే సమయాన్ని బాగా తగ్గించాలని, ఇళ్లలో ‘డివైజ్ ఫ్రీ జోన్ల’ను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.






