Mahaa Daily Exclusive

  మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తు ముమ్మరం..! కస్టడీలో నిందితులు రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌ శర్మ..!

Share

  • శంషాబాద్ రూరల్ పీఎస్‌లో విచారిస్తున్న సిట్ అధికారులు.

హైదరాబాద్, మహా.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని తీవ్రస్థాయిలో విచారిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఈ ముమ్మర విచారణ కొనసాగుతోంది. అసలు ఆ ఫామ్‌హౌస్‌లో భారీ స్థాయిలో డ్రగ్స్ పార్టీ ఎందుకు నిర్వహించారు, ఆ పార్టీకి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందింది, దీని వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కీలక విషయాలను రాబట్టేందుకు సిట్ అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.
ప్రధానంగా పార్టీ జరుగుతున్న సమయంలో కాల్పులు జరపడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై సిట్ అధికారులు నిందితులను లోతుగా ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఈ పార్టీకి పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ శర్మతో ఉన్న సంబంధాలపై ప్రధాన నిందితుడు పైలట్ రోహిత్ రెడ్డిని పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ నెట్‌వర్క్ మూలాలను పూర్తిగా ఛేదించే దిశగా సిట్ బృందం పక్కా ఆధారాలతో నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబడుతోందని తెలుస్తోంది. ఈ విచారణతో రానున్న రోజుల్లో ఈ కేసులో మరింత మంది బడా బాబుల పేర్లు, డ్రగ్స్ మూలాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

Latest