Mahaa Daily Exclusive

  రియల్ ఎస్టేట్ బడా స్కామ్ వెలుగులోకి..! నిజాంపేటలో భారీ రియల్ మోసం..!

Share

  • రియల్ ఎస్టేట్ బడా స్కామ్ వెలుగులోకి!
  • నిజాంపేటలో భారీ రియల్ మోసం..
  •  రూ.15.26 కోట్ల కుచ్చుటోపి! ఒకే ఫ్లాట్‌..
  • రెండు రిజిస్ట్రేషన్లు.. సబ్‌ రిజిస్ట్రార్లతో సహా పలువురిపై పోలీసుల ఉక్కుపాదం.

 

హైదరాబాద్, మహా.

 

నమ్మకమే పెట్టుబడిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టిన కొనుగోలుదారులను కొందరు కేటుగాళ్లు పక్కా పథకం ప్రకారం నట్టేట ముంచారు. నిజాంపేటలోని సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫ్లాట్లను గతంలోనే కొందరు వ్యక్తులకు విక్రయించిన నిందితులు, ఆ విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచారు. ఆ ఫ్లాట్లు అప్పటికే అమ్ముడయ్యాయన్న నిజాన్ని దాచిపెట్టి, బాధితులైన మోటూరి శ్రీనివాస్ ప్రసాద్, సూర్యకమల్ ప్రసాద్‌లను సంప్రదించారు. తమ వద్ద ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయని నమ్మబలికి, వారి నుంచి వివిధ విడతల్లో మొత్తం రూ.15.26 కోట్లను వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత, అప్పటికే ఇతరుల పేరు మీద ఉన్న అదే ఫ్లాట్లను బాధితుల పేరు మీద మళ్లీ రిజిస్ట్రేషన్ (డబుల్ రిజిస్ట్రేషన్) చేసి చేతులు దులిపేసుకున్నారు.

తాము కొనుగోలు చేసిన ఆస్తులు అప్పటికే ఇతరులకు విక్రయించబడినట్లు గుర్తించిన బాధితులు హతాశులై సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ మోసంపై రంగంలోకి దిగిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిడమర్తి శివప్రసాద్, నవీన్‌కుమార్‌ గోయల్, నరేంద్రకుమార్‌ మోదీ, శశికాంత్‌ మోదీలపై కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిందితులకు వెన్నుదన్నుగా నిలిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని పాత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు, నిందితుల బ్యాంకు ఖాతాల లావాదేవీల పైనా నిఘా ఉంచారు. విచారణలో మరిన్ని కీలక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Latest