Mahaa Daily Exclusive

  నోటీసులు అందాక స్పందిస్తా…! ఎమ్మెల్యే దానం నాగేందర్..! 

Share

  • నోటీసులు అందాక స్పందిస్తా.
  • ఎమ్మెల్యే దానం నాగేందర్!
  • అనర్హత వేటుపై హైకోర్టు నోటీసుల వేళ కీలక వ్యాఖ్యలు..
  •  స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేయడంపై విస్మయం.
  • బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయింది!
  •  ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్‌పై దానం ఎద్దేవా..
  • అమిత్ షా మాటలు ఆయనకు తెలియదా అని ప్రశ్న.

 

హైదరాబాద్, మహా.

 

తన అనర్హత పిటిషన్‌కు సంబంధించి హైకోర్టు జారీ చేసిన నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. మంగళవారం హైదరాబాద్‌ ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు నోటీసులు ఇచ్చినట్లు తాను పత్రికల్లో చూశానని, అయితే అవి తనకు ఇంకా అందలేదని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా నోటీసులు అందిన తర్వాత తన న్యాయవాదితో సంప్రదించి చట్టబద్ధంగా సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన అనర్హత కేసులో స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని స్పష్టంగా అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో స్పీకర్ ఇచ్చిన నిర్ణయాలను వ్యతిరేకించవద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా గతంలో ప్రకటించారని, బహుశా ఆ విషయం మహేశ్వర్ రెడ్డికి తెలుసో లేదో తనకు అర్థం కావడం లేదని దానం చురకలు అంటించారు.

మరోవైపు ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టులో కీలక విచారణ జరిగింది. నాగేందర్పై ఉన్న అనర్హత పిటిషన్ను కొట్టివేస్తూ స్పీకర్ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏలేటి మహేశ్వర్రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె. వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. స్పీకర్ తన తీర్పులో పలు లోపాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన నాగేందర్, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారని, స్వయంగా సొంత పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారని వివరించారు. మరో పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసినప్పుడే సదరు వ్యక్తి స్వచ్ఛందంగా తన సభ్యత్వాన్ని వదులుకున్నట్లు భావించాలని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఈ సందర్భంగా న్యాయవాది ఉటంకించారు. వాదనలను విన్న ధర్మాసనం, ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ కమ్ ట్రైబ్యునల్‌తో పాటు దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

Latest