Mahaa Daily Exclusive

  భాగ్యనగర తూర్పు తీరానికి ‘డబుల్’ కితాబు..! ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్..!

Share

  • భాగ్యనగర తూర్పు తీరానికి ‘డబుల్’ కితాబు
  • ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ కారిడార్!
  • విజయవాడ హైవేపై ట్రాఫిక్ కష్టాలకు చెక్.
  • ఆరు నెలల్లో పనులు ప్రారంభించేలా మంత్రి కోమటిరెడ్డి హామీ!
  • నాగపూర్ తరహాలో ఎలివేటెడ్ రహదారి.
  • కేంద్ర వార్షిక ప్రణాళికలో చేర్చాక డీపీఆర్ సిద్ధం!
  • శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు.
  • ఆరు లైన్ల విస్తరణకు ఎమ్మెల్యేల విజ్ఞప్తి!
  • రోడ్డు దాటాలంటే ప్రాణసంకటమే.
  • ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లపై అసెంబ్లీలో సభ్యుల ఆవేదన!

హైదరాబాద్, మహా.

 

హైదరాబాద్ మహానగరంలో అత్యంత రద్దీగా ఉండే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ప్రయాణం ఇకపై సాఫీగా సాగనుంది. ఈ మార్గంలో ట్రాఫిక్ నరకాన్ని వదిలించేందుకు ప్రభుత్వం వినూత్నమైన ‘డబుల్ డెక్కర్’ రహదారి నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. నాగపూర్ తరహాలో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.

 

**కోటి ఆశలతో 12 లక్షల మంది ప్రజలు**

 

ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ పరిధిలో సుమారు 65 కాలనీలు ఉన్నాయని, దాదాపు 12 లక్షల మంది జనాభా ఈ రహదారిపైనే ఆధారపడి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్చిన వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో అనుమతులు సాధించి, ఆరు నెలల్లో పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సభ్యులకు హామీ ఇచ్చారు. విజయవాడకు కేవలం రెండు, మూడు గంటల్లోనే చేరుకునేలా ఈ డబుల్ డెక్కర్ రోడ్డు దోహదపడుతుందని వివరించారు.

 

**ప్రమాదాల నివారణే లక్ష్యం: సభ్యుల ఆందోళన**

 

చర్చలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడ రహదారిపై కాలేజీలు, పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయని, రోడ్డు దాటే క్రమంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని సభ దృష్టికి తెచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత కీలక ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. అదేవిధంగా తుక్కుగూడ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిని ఆరు లైన్ల రోడ్డుగా విస్తరించాలని, అక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన నియోజకవర్గంలోని అధ్వాన్నపు రోడ్ల పరిస్థితిని వివరించి, కొత్త రోడ్ల మంజూరుకు కోరారు.

 

**మత సామరస్యం.. ట్రాఫిక్ నియంత్రణ**

 

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పనామా వద్ద ఫ్లైఓవర్ మంజూరు చేసినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అయితే రహదారిపై ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద ట్రాఫిక్ జాం అవుతోందని, మత పెద్దలతో చర్చించి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తే రద్దీ తగ్గుతుందని సూచించారు. పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

 

**అభివృద్ధి పథంలో తెలంగాణ రోడ్లు**

 

సభ్యుల ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ.. కేవలం నగరంపైనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని చెప్పారు. తెలంగాణను రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ నిధులు సాధిస్తామని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

Latest