- ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు
- ఈమెయిల్లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
- స్పీకర్ మెయిల్ కు బెదరింపు మెస్జ్ పంపిన అగంతకులు
న్యూఢిల్లీ, మహా : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గతంలో హాస్పిటల్స్, స్కూళ్లకు పలుమార్లు బాంబు బెదిరింపులు రాగా, తాజాగా ఢిల్లీ అసెంబ్లీని టార్గెట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ భవనంతో పాటు ఢిల్లీ మెట్రోలోని విధాన సభ స్టేషన్లను పేల్చివేస్తామంటూ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం తెలిపారు.
ప్రధాని మోదీ, అమిత్ షాలకు సైతం బెదిరింపులు..
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ సమాచారం ప్రకారం, ఆ ఈమెయిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధూలను సైతం బాంబులతో పేల్చివేస్తామని హెచ్చరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా సహా పలువురు సీనియర్ నాయకులను లక్ష్యంగా చేసుకుంటూ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ సీఎంతో పాటు అసెంబ్లీ, మెట్రోను టార్గెట్ చేశామంటూ మెయిల్ రావడాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతా సంస్థలు అసెంబ్లీ ప్రాంగణంలో, మెట్రో స్టేషన్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈమెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పంపారో గుర్తించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈమెయిల్ బెదిరింపులో ఎంతవరకు నిజం ఉంది, గతంలో వచ్చిన మెయిల్స్ ను అధికారులు పరిశీలించి.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.






