- మహిళలకు ప్రాధాన్యం
- కోఆప్షన్‌పై సందిగ్ధత
- 29 వేల ఓట్లు పోలింగ్
- 2 వేల వరకు చెల్లని ఓట్లు..
- 23 సభ్యుల విజయంలో 8 మంది పాత కౌన్సిల్ సభ్యులు..
- 30 శాతం రిజర్వేషన్‌తో 5 మహిళలకు స్థానం..
హైదరాబాద్, మహా :
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. జనవరి 30న జరిగిన బార్ కౌన్సిల్ ఎన్నికలలో సుమారు 29 వేల మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అందులో దాదాపు 2 వేల వరకు ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఈ ఎన్నికల్లో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులుగా గెలుపొందేందుకు 1,085 ఓట్లను కట్‌ఆఫ్‌గా నిర్ణయించి, ఆ మార్క్‌ను దాటిన 18 మందిని విజేతలుగా ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ ప్రకారం అత్యధిక ఓట్లు సాధించిన మరో ఐదుగురు మహిళా సభ్యులను కట్ ఆఫ్ తో సంబంధం లేకుండా తొలిసారి ఐదుగురు మహిళ సభ్యులను విజేతలుగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విశేషంగా 23 మంది విజేతల్లో 8 మంది ఇప్పటికే గతంలో బార్ కౌన్సిల్ సభ్యులుగా సేవలందించిన వారు కావడం గమనార్హం. అదే సమయంలో, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమలు చేసిన 30 శాతం మహిళా రిజర్వేషన్ నేపథ్యంలో ఐదుగురు మహిళా న్యాయవాదులు విజయం సాధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
*- కోఆప్షన్ సభ్యులపై స్పష్టత ఎప్పుడు..?*
ఈ ఎన్నికల్లోఎన్నికైన సభ్యులు రెండు నుంచి మూడు వారాల్లో సమావేశమై కోఆప్షన్ ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం మరో ఇద్దరు మహిళా సభ్యులను కోఆప్షన్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉంది.
అయితే, కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఇప్పటివరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. ఈ రూల్స్ రూపొందించేందుకు సుమారు 15 రోజులు పట్టే అవకాశం ఉండగా, మొత్తం ప్రక్రియ పూర్తవడానికి దాదాపు 30 రోజులు పడే అవకాశముంది.
*- చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..*
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలపై కూడా ఆసక్తి నెలకొంది. కోఆప్షన్ సభ్యులు కూడా ఓటింగ్‌లో పాల్గొంటారా లేదా అన్న అంశం ఇంకా స్పష్టతకు రాలేదు.
చైర్మన్ పదవిని ఆకాంక్షిస్తున్న వారిలో ప్రముఖంగా సునీల్ గౌడ్ పేరు వినిపిస్తోంది. సునీల్ గౌడ్ వరుసగా మూడోసారి విజయం సాధించడమే కాక, 2018 లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది సుదీర్ఘంగా 8 ఏళ్లు వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది. చైర్మన్ రేసులో ఉన్న మరో సభ్యుడు
అనంత సేనారెడ్డి మూడోసారి గెలుపు కైవసం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఇతనితోపాటు
బార్ కౌన్సిల్ కు రెండోసారి గెలుపొందిన హనుమంత రెడ్డి కూడా ఈ రేసులో ఉన్నారు. తొలిసారిగా ఎన్నికైన
పొన్నం అశోక్ గౌడ్,
రామిరెడ్డిలు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీ నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*- మహిళా రిజర్వేషన్.. చారిత్రాత్మక నిర్ణయం..*
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తొలిసారిగా మహిళా రిజర్వేషన్ అమలు చేయగా, తెలంగాణ రాష్ట్రం ఈ విధానాన్ని అనుసరించి 30 శాతం రిజర్వేషన్‌తో ఐదుగురు మహిళా సభ్యులను ఎన్నిక చేయడం చారిత్రాత్మకంగా మారింది. ఇంకా కోఆప్షన్ ద్వారా మరో ఇద్దరు మహిళా సభ్యులు ఎంపిక కానుండటంతో, మహిళా ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. దేశంలోనే మహిళా రిజర్వేషన్ను అమలు చేసి మహిళా సభ్యులకు ప్రాతినిధ్యం ఇస్తున్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ప్రథమం కావడం మరో చరిత్రాత్మక ఘట్టం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా బార్
ఎన్నికలు ముగిసినా, కోఆప్షన్ సభ్యుల ఎంపిక, చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉత్కంఠను రేపుతుండగా.. కో ఆప్షన్ సభ్యుల విషయంలో బీసీఐ మార్గదర్శకాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్‌లో తదుపరి రాజకీయాలు మరింత ఉత్కంఠ మారనున్నాయి.






