- వదంతులతో బంకుల వద్ద బారులు.
- పెట్రోల్‌కు ‘నో స్టాక్’.. ఆటోలకు తిప్పలు.
- కృత్రిమ కొరత సృష్టించవద్దన్న పౌరసరఫరాల శాఖ!
- వదంతులు నమ్మొద్దు.. నిల్వలు పుష్కలం.
- ఇంధన సరఫరాపై ప్రభుత్వం కీలక ప్రకటన!
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మహానగరంలో మంగళవారం ఇంధన సరఫరాకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ , ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందన్న ప్రచారం దావాగ్నంలా వ్యాపించడంతో వాహనదారులు బంకుల వద్దకు పరుగులు తీశారు. రంగారెడ్డి జిల్లా అంబర్‌పేట నుంచి పాతబస్తీ వరకు మెజారిటీ పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమివ్వడం ప్రజల్లో మరింత ఆందోళన నింపింది. ఈ గందరగోళ పరిస్థితుల వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో నగరంలోని ప్రధాన రహదారులు స్తంభించిపోయాయి. అంబర్‌పేటలోని పలు బంకుల్లో కేవలం డీజిల్ మాత్రమే అందుబాటులో ఉందని, పెట్రోల్ లేదని బోర్డులు పెట్టడం సామాన్య వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పుకార్ల ప్రభావంతో ప్రజలు బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ నింపుకుని వెళ్తుండటంతో పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు కనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ల వద్ద ఎనిమిది గంటలకు పైగా నిరీక్షిస్తున్నా గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొంది. పాతబస్తీలోని బహదూర్ పురా, మీర్ అలం, హస్సన్ నగర్, చంపాపేట్, సంతోష్ నగర్ వంటి ప్రాంతాల్లో గ్యాస్ కోసం ఆటోల లైన్లు కిలోమీటర్ల మేర సాగాయి. గ్యాస్ ఎప్పుడు వస్తుందో తమకు తెలియదని నిర్వహకులు చేతులెత్తేయడంతో ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో, రోజంతా ఇలా క్యూ లైన్లలోనే ఉండిపోతే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాల వద్ద అసహనం పెరిగిపోవడంతో పలుచోట్ల వాగ్వాదాలు కూడా చోటుచేసుకున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగి పరిస్థితిపై స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో ఇంధన కొరత ఏ మాత్రం లేదని, నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆయిల్ రిఫైనరీల నుంచి డిపోల వరకు సరఫరా యంత్రాంగం సక్రమంగానే పనిచేస్తోందని, కేవలం తప్పుడు వదంతుల వల్లే ప్రజలు భయపడి అకస్మాత్తుగా ఇంధనం కొనుగోలుకు ఎగబడటంతో ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని స్పష్టం చేసింది. వాహనదారులు తమ ట్యాంకులు పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగి, బంకుల్లో స్టాక్ అయిపోతోందని అధికారులు వివరించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన చిన్నపాటి మార్పుల వల్ల డీలర్లకు తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయని, ఇది కేవలం అంతర్గత పరిపాలన పరమైన విషయమే తప్ప సరఫరాలో లోపం కాదని ప్రభుత్వం పేర్కొంది.
ఇంధన అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఏవైనా అక్రమాలు జరిగితే పౌరసరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలని సూచించింది.






