Mahaa Daily Exclusive

  అసెంబ్లీలో భట్టి ‘బడ్జెట్’ గర్జన..! గత సర్కారు అప్పుల కుప్పపై శ్వేతపత్రం..!

Share

  • అసెంబ్లీలో భట్టి ‘బడ్జెట్’ గర్జన.
  •  గత సర్కారు అప్పుల కుప్పపై శ్వేతపత్రం!
  •  బీఆర్‌ఎస్‌ తీరు ‘ఆడలేక మద్దెల ఓడు’.
  •  బడ్జెట్ పత్రాల చింపివేతపై డిప్యూటీ సీఎం నిప్పులు!
  •  విద్యార్థులకు ‘అల్పాహారం’.. రైతులకు ‘బోనస్’ సంక్షేమమే ఊపిరిగా కాంగ్రెస్ బడ్జెట్!
  •  కోటి మంది మహిళల ‘కోటీశ్వర’ కల.
  •  లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలతో మహాలక్ష్ములకు అండ.
  •  పెండింగ్ బిల్లుల పాపం గతానిది.. చెల్లింపుల పుణ్యం మాది.
  •  అసెంబ్లీ సాక్షిగా భట్టి విక్రమార్క విశ్లేషణ!

 

హైదరాబాద్, మహా.

సంక్షేమ పథమే లక్ష్యం.. ప్రజా శ్రేయస్సే మార్గం: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజం!

తెలంగాణ శాసనసభ వేదికగా మంగళవారం బడ్జెట్‌పై జరిగిన చర్చ అత్యంత ఆసక్తికరంగా, భావోద్వేగభరితంగా సాగింది. ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, తమ ప్రభుత్వ సంక్షేమ దిశను స్పష్టం చేశారు. గత పదేళ్లలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లారని ఆయన మండిపడ్డారు. హాస్టళ్ల అద్దె బిల్లుల నుంచి కాంట్రాక్టర్ల పేమెంట్ల వరకు అన్నింటినీ తమ ప్రభుత్వం వచ్చాకే క్లియర్ చేస్తున్నామని ఆయన గణాంకాలతో వివరించారు. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన రూ. 6,500 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించి వారిలో భరోసా నింపామని, క్యాష్‌లెస్ హెల్త్ కార్డుల కోసం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వారి కలని నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని భట్టి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడంతో పాటు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం చారిత్రక ఘట్టమని అభివర్ణించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందిస్తుంటే ఓర్చుకోలేని స్థితిలో ప్రతిపక్షం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. హాస్టళ్లలో ఉండే విద్యార్థుల కోసం కాస్మోటిక్ ఛార్జీలను ఏకంగా 200 శాతం పెంచామని, అద్దె భవనాల్లో ఉన్న వసతి గృహాల నిధులను ప్రతి నెలా క్రమం తప్పకుండా విడుదల చేస్తామని బడ్జెట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇది కేవలం అంకెల గారడీ కాదని, ప్రతి పేద విద్యార్థి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

రైతు సంక్షేమం మరియు మహిళా సాధికారతపై భట్టి విక్రమార్క ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ఉచిత విద్యుత్ పథకానికి పేటెంట్ హక్కు తమ పార్టీకే ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం రైతు భరోసాను కేవలం ఎన్నికల తాయిలంగా మార్చుకుందని, తాము మాత్రం ప్రతి క్వింటా ధాన్యానికి రూ. 500 అదనపు బోనస్ ఇచ్చి అన్నదాతను ఆదుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో, స్వయం సహాయక సంఘాలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకే వారిని ‘మహాలక్ష్మి’లుగా భావించి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు తాము బడ్జెట్ ప్రవేశపెడుతుంటే వినే ఓపిక లేక పత్రాలు చించి సభ నుంచి వెళ్లిపోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్న చందంగా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడటం సరికాదని హితవు పలికారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి రావాల్సిన రూ. 10 వేల కోట్లను సాధించుకున్నామని, ప్రతి పైసాను పారదర్శకతతో ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించడమే కాకుండా, కుటుంబంలోని పెద్ద మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు సమగ్ర బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటించారు.

Latest