ఐకేపీ అక్రమాలపై విచారణ
*విచారణకు ఆదేశించిన జాయింట్ కలెక్టర్ శ్రీజ
*ఏపీడీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన బృందం
*మొట్లగూడెం అక్రమంపై అవాక్కైన విచారణ బృందం
*మహా వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం
కారేపల్లి, మహా:కారేపల్లి మండలంలో ఐకేపీలో జరిగిన అక్రమాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఎట్టకేలకు విచారణకు ఆదేశించారు. జెసి ఆదేశాలతో డీఆర్ డీవో ఏపీడీ జయశ్రీ బృందం బుధవారం కారేపల్లి ఐకేపీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. బకాయిలు పడ్డ స్వయం సహాయక సంఘాలు, మొండి బకాయిల ఫైళ్ళను పరిశీలించారు.
*మొట్లగూడెం అక్రమంపై అవాక్కైన అధికారులు…
మండలంలోని మోట్లగూడెం గ్రామంలో స్వరాజ్, వినాయక్ గ్రూపుల పేరుతో గ్రామంలో లేని వారి పేర్లతో రుణాలు కాజేసిన వ్యవహారం పై విచారణ అధికారులు అవాక్కయ్యారు. ఉత్తుత్తి గ్రూపులతో 12 లక్షల రూపాయలను కాజేసిన తీరుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఈ అక్రమం పై మహా దినపత్రికలో ఆధారాలతో వచ్చిన కథనాలన్నీ అక్షర సత్యాలుగా విచారణ అధికారులు గుర్తించారు. కొందరు ఐకేపీ అధికారులు బ్యాంకు అధికారి కుమ్మక్కై చేసిన ఈ అక్రమం పై పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా సేకరించారు. విచారణ నివేదికను జేసీ కి సమర్పిస్తామని ఏపిడి తెలిపారు.







