* కాలుష్య రహిత ‘వుడ్ గ్యాసిఫయర్’ ప్రారంభించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
మొయినాబాద్,మహా.
దేశంలో యుద్ధ వాతావరణం కారణంగా తలెత్తుతున్న ఎల్‌పీజీ గ్యాస్ కొరతను అధిగమించేందుకు వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే ‘బయో మాస్ పెల్లెట్స్’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్ నగర్‌లో జేకేఎంఆర్ ఫౌండేషన్ యువకులు రూపొందించిన ‘బయో మాస్ పెల్లెట్ వుడ్ గ్యాసిఫయర్’ను ఆయన లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్స్ నిర్వాహకులకు ఈ గ్యాసిఫయర్ స్టవ్‌లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఈ గ్యాసిఫయర్ సాంకేతికత పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఇందులో ప్రైమరీ, సెకండరీ అనే రెండు రకాల మంటలు ఉంటాయని, ప్రారంభంలో కొద్దిగా పొగ వచ్చినప్పటికీ.. సెకండరీ మంట మొదలవ్వగానే పొగలో ఉండే కార్బన్ పార్టికల్స్, హైడ్రోజన్, మీథేన్ వంటివి కూడా పూర్తిగా కాలిపోయి మంటగా మారుతాయని తెలిపారు. దీనివల్ల కాలుష్యం ఉండదని, మంట తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. హోటల్స్ నిర్వాహకులు ఈ ఆవిష్కరణ పట్ల ఎంతో ఆసక్తి చూపుతున్నారని, ప్రొడక్షన్ పెంచాలని కోరుతున్నారని ఆయన వెల్లడించారు.
మన దేశంలో ఏటా దాదాపు 50 కోట్ల టన్నుల వ్యవసాయ వ్యర్థాలు అందుబాటులో ఉంటున్నాయని ఎంపీ గుర్తు చేశారు. వరి గడ్డి, జొన్న, మక్క, చెరుకు సొప్పతో పాటు పండ్లు, కూరగాయల తొక్కల నుంచి తయారయ్యే బయో మాస్ పెల్లెట్స్‌ను ఇంధనంగా వాడుకోవడం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా, విదేశీ ఇంధనంపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఇంధన భద్రత ఎంతో ముఖ్యమని, భవిష్యత్తులో ఈ గ్యాసిఫయర్ల వల్ల సామాన్యులకు ఎంతో లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం, కంజర్ల ప్రకాష్, సన్ వెల్లి ప్రభాకర్ రెడ్డి, శాబాద్ కిషన్, శ్రీకాంత్, చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు పార్టీ నాయకులు, హోటల్స్ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







