- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
- తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటాం.
- రాహుల్ గాంధీ ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం.
- కౌశిక్‌రెడ్డి ప్రవర్తన దారుణమన్న పీసీసీ బాస్.
- సన్నబియ్యం పంపిణీపై కేంద్రం తీరుపై ధ్వజం.
హైదరాబాద్, మహా.
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే, తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఏ లక్ష్యంతోనైతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారో, రాహుల్ గాంధీ ఏ ఆకాంక్షలతో ప్రజలకు హామీలు ఇచ్చారో.. వాటన్నింటినీ తమ ప్రభుత్వం తూచా తప్పకుండా నెరవేరుస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం దేశంలోనే అత్యుత్తమమైన పాలసీని తీసుకురాబోతున్నామని ఆయన ప్రకటించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై మహేశ్‌కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని, కేవలం కేటీఆర్ దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులపై మతపరమైన వ్యాఖ్యలు చేయడం, అమర్యాదగా ప్రవర్తించడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. దీనిపై ఇప్పటికే సీఐడీ విచారణ జరుగుతోందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన గుర్తు చేశారు. పెద్దల సభగా పిలిచే శాసన మండలిలో సభ్యులు పేపర్లు చించి ఛైర్మన్‌పై వేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని, అది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన విమర్శలు మానేసి, సభా మర్యాదలను మంటగలుపుతున్నాయని ధ్వజమెత్తారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కూడా పీసీసీ అధ్యక్షుడు విమర్శలు సంధించారు. దేశవ్యాప్తంగా పేదలకు సన్నబియ్యం ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కేంద్రం మొండిచేయి చూపించినప్పటికీ, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తూ తన చిత్తశుద్ధిని చాటుకుంటోందని మహేశ్‌కుమార్ గౌడ్ వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నామని, విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీ మొదలుకొని గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి అక్రమంపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.







