Mahaa Daily Exclusive

  మందుతో మక్కపెట్టి.. ప్రాణాలతో చెలగాటం.. ఆసిఫ్‌నగర్‌లో 7 టన్నుల కల్తీ మామిడి పండ్లు సీజ్..

Share

హైదరాబాద్‌, మహా.

వేసవి కాలం ప్రారంభంలోనే మామిడి పండ్ల సీజన్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు వాడి మామిడి పండ్లను కృత్రిమంగా పండిస్తున్న వైనంపై హైదరాబాద్‌ ఫుడ్‌ సేఫ్టీ అసిస్టెన్స్‌ అండ్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ అధికారులు ఉక్కుపాదం మోపారు. శుక్రవారం ఆసిఫ్‌నగర్‌ ప్రాంతంలోని ఒక ఫ్రూట్‌ గోదాంపై ఆకస్మిక దాడులు నిర్వహించిన అధికారులు, భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిర్వహణలో ఎటువంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, అతి తక్కువ సమయంలో పండ్లు పచ్చగా పండేలా చేసేందుకు ‘ఇథలీన్‌’ వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. బాటాసింగారం పండ్ల మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన పచ్చి మామిడి కాయలను ఇక్కడ నిల్వ ఉంచి, రసాయనాలతో మక్కపెట్టి మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 350 ట్రేలలో ఉన్న సుమారు 7 టన్నుల మామిడి పండ్లను సీజ్‌ చేసిన అధికారులు, వీటి విలువ లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కృత్రిమంగా పండించిన పండ్లను తింటే కాలేయం, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యానికి హాని కలిగించేలా పండ్లను పండించడం చట్టరీత్యా నేరమని, అటువంటి గోదాంల నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. వినియోగదారులు కూడా పండ్లను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అసహజమైన రంగులు లేదా వాసన కలిగిన పండ్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. నగరవ్యాప్తంగా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని అధికారులు స్పష్టం చేశారు.