Mahaa Daily Exclusive

  పరిశోధన క్షేత్రాలపై మూసీ ముప్పు…

Share

* గ్లోబల్ మిలెట్ హబ్ భూముల్లో మార్కింగ్.
*అన్నపూర్ణ లాంటి సంస్థలకు ‘అభివృద్ధి’ సెగ.
* సీఎస్‌కు ఐకార్ డీజీ లేఖ.. నేడు హైదరాబాద్‌కు రాక.
*ప్రయోగాలు ఆగిపోతే భావి తరాలకు కష్టమే.
* వ్యవసాయ భూముల రక్షణకు ఆర్డినెన్స్ తేవాలని నిపుణుల డిమాండ్.

హైదరాబాద్, మహా.

దేశానికే గర్వకారణమైన, ప్రపంచం మెచ్చుకున్న చిరుధాన్యాల పరిశోధన కేంద్రం ఇప్పుడు ఉనికి చాటుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు కోసం రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్)కు చెందిన సుమారు 10.38 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించడం వ్యవసాయ రంగంలో కలకలం రేపుతోంది. చిరుధాన్యాల సాగులో భారత్‌ను ప్రపంచ గురువుగా నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ సంస్థను ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రకటించారు. సరిగ్గా ప్రధాని పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలోనే, ఇక్కడి ప్రయోగ క్షేత్రాలకు మార్కింగ్ వేయడం గమనార్హం.
విషయం తీవ్రతను గుర్తించిన భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్. జట్ స్వయంగా రంగంలోకి దిగారు. రాజేంద్రనగర్‌లోని అమూల్యమైన పరిశోధన భూములను కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఆయన ఘాటుగా లేఖ రాశారు. ఈ అంశంపై చర్చించేందుకు, అలాగే సంస్థ ప్రగతిని పరిశీలించేందుకు డీజీ మే 6వ తేదీ (బుధవారం) హైదరాబాద్‌కు వస్తున్నారు. అయితే, ఒకవైపు ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతుండగానే, మరోవైపు ఏప్రిల్ 30వ తేదీనే మార్కింగ్ పనులు పూర్తి కావడంపై శాస్త్రవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఇక్కడ సాగుతున్న విత్తన ప్రయోగాలు, ఎరువుల పరీక్షలు ఈ భూమిని కోల్పోతే బూడిదలో పోసిన పన్నీరు అవుతాయని ఆవేదన చెందుతున్నారు.
ఈ భూమి కేవలం మట్టి కాదని, దేశ ఆహార భద్రతకు వెన్నెముక వంటిదని వ్యవసాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ అత్యంత అరుదైన విత్తన రకాలను అభివృద్ధి చేస్తున్నారు. కేవలం ఐఐఎంఆర్ మాత్రమే కాకుండా, పక్కనే ఉన్న జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్), ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ భూములకు కూడా మూసీ అభివృద్ధి సెగ తగిలేలా ఉంది. వీటిపై మాట్లాడితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో శాస్త్రవేత్తలు, సంస్థ సంచాలకులు మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏళ్ల నాటి శాస్త్రీయ కష్టం వృధా అవుతుందని, ఇది పరోక్షంగా భవిష్యత్తులో పౌష్టికాహార లోపానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అభివృద్ధి అవసరమే అయినా, దేశానికి అన్నం పెట్టే పరిశోధనా కేంద్రాలను బలిపెట్టడం సరికాదని రైతు సంఘాలు మరియు పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కీలకమైన భూములను సేకరించకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక ప్రత్యేక చట్టం లేదా ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతున్న వేళ, ఆ పరిశోధనలకు పురిటిగడ్డ వంటి ఈ క్షేత్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. రాజధాని సుందరీకరణ కోసం దేశ భవిష్యత్తును పణంగా పెట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.