కరీంనగర్, మహా : విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్‌లకు తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టులాంటివని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ (ఉత్తరాది, దక్షిణాది అని వ్యత్యాసం లేకుండా) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. 4 రాష్ట్రాలు కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం ఫలితాలపై బండి సంజయ్ కరీంనగర్ లో స్పందించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి లభిస్తున్న ఆదరణే ఎన్నికల ఫలితాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి భయాలు ఉండవన్నారు. పశ్చిమ బెంగాల్ లో తొలిసారి బీజేపీ విజయం సాధించగా, పుదుచ్చేరిలో అధికారాన్ని తిరిగి సొంతం చేసుకుంది. అస్సాంలో బీజేపీ మరోసారి అధికారం నిలబెట్టుకుని సత్తా చాటింది. తమిళనాడులో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు సాధించి ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే లను మట్టి కరిపించింది. నటుడు విజయ్ టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది.








