Mahaa Daily Exclusive

  అసోంలో కమల వికాసం….

Share

*అసోంలో కమల వికాసం
*ముచ్చటగా మూడోసారి ఎన్డీయేదే అధికారం!
*వ్యూహాత్మకంగా అడుగులేసి కాంగ్రెస్‌ను చిత్తు చేసిన కాషాయ దళం
హైదరాబాద్, మహా.
అసోం అసెంబ్లీ ఎన్నికల్లో (2026) భారతీయ జనతా పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసి, వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ స్థాయి చరిష్మాకు, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ క్షేత్రస్థాయి వ్యూహాలు తోడవడంతో అసోంలో కమలదళం హ్యాట్రిక్ విజయఢంకా మోగించింది. ప్రాంతీయ పార్టీల మద్దతు, జనరంజక మేనిఫెస్టో, మహిళలు మరియు యువత బ్రహ్మరథం పట్టడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ పట్టు మరింత బలపడిందని, విపక్షాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
**కలిసొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన**
ఈ చారిత్రక విజయానికి ప్రధానంగా 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఎంతో కీలకమనే చెప్పాలి. మొత్తం 126 అసెంబ్లీ స్థానాల భౌగోళిక సరిహద్దుల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో, గతంలో 35 నియోజకవర్గాల్లో కింగ్ మేకర్లుగా ఉన్న ముస్లిం ఓటర్ల ప్రభావం 24 స్థానాలకు పడిపోయింది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలను వేర్వేరు నియోజకవర్గాల్లో విలీనం చేయడం బీజేపీకి వ్యూహాత్మకంగా లాభించింది. దీనికి తోడు గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్‌ పార్టీలు ఈసారి విడివిడిగా బరిలోకి దిగడం ప్రతిపక్షాల ఓట్ల చీలికకు దారితీసింది. ఇదే సమయంలో బీజేపీ మిత్రపక్షమైన అసోం గణ పరిషత్ (ఏజీపీ) ఏకంగా 13 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దించి మైనారిటీ ఓట్లను కూడా పరోక్షంగా చీల్చడంలో సఫలమైంది.
**ఫలించిన పొత్తులు.. కుదేలైన కాంగ్రెస్**
స్థానిక అస్తిత్వ పార్టీలతో ఎన్డీఏ కూటమి పకడ్బందీగా పొత్తులు పెట్టుకోవడం గెలుపును సునాయాసం చేసింది. అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), రభా హసోంగ్ జౌతా మంచా వంటి పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల క్షేత్రంలోకి దిగడంతో స్థానిక అసోమీయులు, గిరిజనుల ఓట్లు గంపగుత్తగా ఎన్డీఏ ఖాతాలో పడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరు పక్షాలతో కూటమి కట్టినప్పటికీ, ఆ పార్టీలకు క్షేత్రస్థాయిలో సంస్థాగత బలం లేకపోవడం నిరాశపరిచింది. పైగా ఎన్నికల ముందే కాంగ్రెస్ సీనియర్ నేతలు భూపేన్ బోరా, ప్రద్యుత్ బోర్డోలోయ్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతీసింది.
**హిమంత చరిష్మా.. డబుల్ ఇంజిన్ సర్కార్ వరం**
‘డబుల్ ఇంజిన్ సర్కార్’ నినాదం అసోం ఓటర్ల మదిలో బలంగా నాటుకుపోయింది. సీఎం హిమంత బిశ్వ శర్మ ‘ఆశీర్వాద్ యాత్ర’ పేరిట ప్రజలకు నేరుగా చేరువకావడంతో పాటు, కేంద్రం సహకారంతో చేపట్టిన అభివృద్ధి పనులు బీజేపీకి శ్రీరామరక్షగా నిలిచాయి. కేంద్ర నిధులతో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భారీ వంతెనలు (బోగీబీల్, ధోలా-సాదియా), జాతీయ రహదారుల విస్తరణ ప్రజల కళ్లెదుటే సాక్షాత్కరించాయి. యూఎల్‌ఎఫ్ఏ బోడో సాయుధ వర్గాలతో శాంతి ఒప్పందాలు జరగడం, ఏఎఫ్‌ఎప్‌పీఏ (AFSPA) చట్టాన్ని తొలగించడంతో రాష్ట్రంలో దశాబ్దాల అశాంతికి తెరపడింది. మరోవైపు ‘మియా’ (బంగాలీ ముస్లింలు) ముప్పును ప్రచారాస్త్రంగా మలచి, స్థానికులు వర్సెస్ వలసదారులు అనే వాదనతో హిందూ ఓటర్లను ధ్రువీకరించడంలో బీజేపీ నూరు శాతం సక్సెస్ అయింది.
**సంక్షేమ పథకాలే విజయ సోపానాలు**
సంక్షేమ పథకాలతో మహిళలు, యువత మనసు గెలుచుకోవడంలో కాషాయ పార్టీ అగ్రభాగాన నిలిచింది. ‘అరుణోదయ్’ పథకం ద్వారా 26 లక్షల మంది మహిళల ఖాతాల్లో నెలవారీ నగదు జమ చేయడం, 11 లక్షల మంది మహిళలకు మైక్రో ఫైనాన్స్ రుణాల మాఫీ, ఆడపిల్లల చదువుల కోసం ‘నిజుత్ మొయినా’, వ్యాపార ప్రోత్సాహానికి ‘లక్పతీ దీదీ’ వంటి పథకాలు మహిళా ఓటు బ్యాంకును ఏకీకృతం చేశాయి. గత ఎన్నికల హామీ మేరకు 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం, టాటా సెమీకండక్టర్ ప్లాంట్ వంటి పరిశ్రమలతో ఉపాధి కల్పన హామీలు యువతను బీజేపీ వైపు నడిపించాయి. ఇక దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా ఉన్న తేయాకు తోటల కార్మికులను సైతం ‘చా బాగిచా ధన్ పురస్కార్’ పథకంతో బీజేపీ తనవైపు తిప్పుకుని ఈ చారిత్రక హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.