హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.
* దిల్లీలో కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి భేటీ.
* రూ. 38,595 కోట్లతో 7 కారిడార్ల నిర్మాణం.
* ఫేజ్-3 కింద ఎయిర్‌పోర్ట్-ఫ్యూచర్ సిటీ లైన్.
* విస్తరణ కోసమే ఫేజ్-1ను టేకోవర్ చేశాం.
* డీపీఆర్‌ను ఆమోదించాలని కోరిన రాష్ట్ర సర్కార్.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మెట్రో ఫేజ్-2, ఫేజ్-3 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వేదికగా పావులు కదుపుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమైన సీఎం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర డీపీఆర్‌ను ఆమోదించాలని, జాయింట్ వెంచర్ విధానంలో కేంద్రం ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి ప్రతిపాదించిన మెట్రో కారిడార్‌ను ఫేజ్-3 కింద చేపట్టాలని, ఇందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించినట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. నగరంలో ఏడు కొత్త కారిడార్ల ద్వారా ఏకంగా 122.9 కిలోమీటర్ల మేర మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో ఈ డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇంతటి భారీ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) చేపట్టేందుకు వీలుగా సత్వరమే ఆమోదముద్ర వేయాలని రేవంత్ రెడ్డి కోరారు.
భవిష్యత్ విస్తరణ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాజావుగా సాగే ఉద్దేశంతోనే మెట్రో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్‌ఎల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ఖట్టర్‌కు సీఎం వివరించారు. ప్రస్తుతం మొదటి దశ పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి వచ్చినందున, ఇకపై రెండో, మూడో దశల విస్తరణ పనులు మరింత సులువుగా, వేగంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. మెట్రో విస్తరణతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, నలువైపులా ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని సీఎం వివరించారు.
అత్యంత కీలకమైన ఈ సమావేశంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారు ఎన్.వి.ఎస్.రెడ్డి, దిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు.








