Mahaa Daily Exclusive

  టీడీపీ మహానాడు 2026…..

Share

టీడీపీ మహానాడు 2026.
* 20 కీలక తీర్మానాలకు రంగం సిద్ధం.
* తెలంగాణ నుంచి నాలుగు ప్రత్యేక ప్రతిపాదనలు.
* ఎన్టీఆర్ భవన్‌లో తీర్మానాల కమిటీ కసరత్తు.
* సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ వ్యూహాలు.
*ఆర్థిక పరిస్థితులపై విస్తృత చర్చలు.
హైదరాబాద్, మహా.

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘మహానాడు 2026’ సమావేశాలపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెండు రోజుల పాటు అట్టహాసంగా సాగనున్న ఈ వేడుకలో దాదాపు 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించాలని పార్టీ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ దిశగా కసరత్తును ముమ్మరం చేసిన టీడీపీ.. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తీర్మానాల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ, మహానాడులో ప్రవేశపెట్టాల్సిన కీలక అంశాలపై సుదీర్ఘంగా, విస్తృతంగా చర్చలు జరిపింది.
రాష్ట్ర రాజకీయ, భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించే ఈ మహానాడులో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జన్మదిన వేడుకల ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు రాజకీయాల్లో ప్రోత్సాహం వంటి కీలక అంశాలపై ఉమ్మడి తీర్మానాలను ప్రవేశపెట్టాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిణామాలపై ఈ వేదికపై లోతైన చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాల పురోగతి, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న మద్దతుతో పాటు, పశ్చిమాసియా యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల వల్ల రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అంతేకాకుండా, ప్రతిపక్షాలు చేస్తున్న విధ్వంసక రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధికి వారు సృష్టిస్తున్న అడ్డంకులను ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా ప్రత్యేక తీర్మానాలను రూపొందించాలని తీర్మానాల కమిటీ భావిస్తోంది. మహానాడు ముగింపు సందర్భంగా కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ దఫా మహానాడులో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంపై కూడా టీడీపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహానాడులో నాలుగు ప్రత్యేక తీర్మానాలను తీసుకురావాలని కమిటీలో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో మళ్లీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, సరికొత్త రాజకీయ వ్యూహాలను రచించడం, ముఖ్యంగా యువతను పెద్దఎత్తున పార్టీ వైపు ఆకర్షించడం వంటి అంశాలు ఈ నాలుగు తీర్మానాల్లో ప్రధానంగా ఉండనున్నాయి.
మహానాడు నిర్వహణ, ఈ తీర్మానాల తుది ముసాయిదా రూపకల్పన కోసం తీర్మానాల కమిటీ త్వరలోనే మరోసారి సమావేశం కానుంది. అనంతరం ఎల్లుండి జరగబోయే టీడీపీ అత్యున్నత నిర్ణాయక మండలి ‘పొలిట్‌బ్యూరో’ సమావేశంలో ఈ తీర్మానాల వివరాలను పార్టీ అధిష్ఠానానికి సమర్పించి, తుది ఆమోదం పొందనున్నట్లు సమాచారం. ఈ మహానాడు రెండు రాష్ట్రాల పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపనుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.