Mahaa Daily Exclusive

  గడువు కంటే ముందే నక్సలిజం అంతం….

Share

గడువు కంటే ముందే నక్సలిజం అంతం.
• భద్రతా బలగాల అలుపెరగని పోరాటం.
• అభివృద్ధి జరగకపోవడానికి అసలు కారణం నక్సలిజమే.
• బస్తర్ గడ్డపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
బస్తర్ (ఛత్తీస్‌గఢ్),మహా.

భద్రతా బలగాల అలుపెరగని పోరాటం, అసమాన ధైర్యసాహసాలు, వీరోచిత త్యాగాల ఫలితంగా దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా పారద్రోలినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సగర్వంగా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ వేదికగా జరిగిన 26వ సెంట్రల్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఈ చరిత్రాత్మక ప్రకటన చేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్దేశించుకోగా, ఆ గడువు కంటే ముందే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఆయన స్పష్టం చేశారు.
**భయానక వాతావరణం నుంచి భరోసా వైపు బస్తర్ అడుగులు**
ఒకప్పుడు తుపాకుల మోతలు, మందుపాతరల పేలుళ్లతో దద్దరిల్లిన బస్తర్ ప్రాంతం నేడు నక్సల్స్ రహిత ప్రాంతంగా మారడం యావత్ దేశానికే గర్వకారణమని అమిత్ షా అభివర్ణించారు. ఈ విజయం వెనుక ఉన్న రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. నక్సలిజాన్ని అంతం చేయడానికి కేంద్రం చేపట్టిన ఈ మహాయజ్ఞంలో అనేక కాంగ్రెసేతర, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి మద్దతును అందించాయని, కానీ ఛత్తీస్‌గఢ్‌లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమకు కనీస సహకారం కూడా అందించలేదని ఆయన ఆరోపించారు. అయితే, 2023 డిసెంబరు 13న విష్ణు దేవ్ సాయి నాయకత్వంలో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, మిగిలి ఉన్న నక్సలైట్లను కూడా ఏరివేసి బస్తర్ ప్రజలకు భద్రతను, భరోసాను కల్పించామని ఆయన వివరించారు. దశాబ్దాల చీకటి యుగం ముగిసిపోయి, ఎట్టకేలకు బస్తర్ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
**అభివృద్ధి జరగకపోవడానికి అసలు కారణం నక్సలిజమే: అపోహలను బద్దలు కొట్టిన అమిత్ షా**
దశాబ్దాలుగా నక్సలిజానికి మద్దతుగా నిలుస్తున్న మేధావుల వాదనలను కేంద్ర హోంమంత్రి ఈ సభ వేదికగా తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లోనే నక్సలిజం ఉద్భవిస్తుందనే వాదన కేవలం ఒక అపోహ మాత్రమేనని, వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరగకపోవడానికి ప్రధాన కారణం నక్సలిజమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. దేశంలో బస్తర్ కంటే ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, కానీ అక్కడ నక్సలిజం పుట్టలేదని, ఆ ప్రాంతాలు క్రమంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని ఆయన ఉదాహరించారు. నక్సల్స్ ప్రాబల్యం, వారు సృష్టించిన అడ్డంకుల వల్లే బస్తర్ లాంటి ప్రాంతాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోయాయని ఆయన స్పష్టం చేశారు.
**భద్రతా శిబిరాల నుంచి అభివృద్ధి కేంద్రాలుగా..**
నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించే దిశగా కేంద్ర హోం శాఖ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని, ఇందులో భాగంగానే బస్తర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 200లకు పైగా భారీ భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. సీఆర్పీఎఫ్, డీఆర్జీ స్థానిక పోలీసు బలగాల సమన్వయంతో సాగిన ఈ ఆపరేషన్లు విజయవంతం కావడంతో, బస్తర్ పూర్తిగా శాంతియుత ప్రాంతంగా అవతరించిందన్నారు. బస్తర్ ప్రాంతంలో శాంతి నెలకొన్న నేపథ్యంలో, భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ శిబిరాలను పౌర సేవా కేంద్రాలుగా మార్చే బృహత్తర కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.
ఇందులో తొలి దశగా, బస్తర్‌లోని 70 భద్రతా శిబిరాలను **’వీర్ షహీద్ గుండాధర్ సేవా డేరా’**లుగా మార్చుతున్నట్లు అమిత్ షా ప్రకటించారు. సోమవారం నాడు ఆయన లాంఛనంగా ప్రారంభించిన ‘షహీద్ వీర్ గుండాధర్ సేవా డేరా జన సువిధా కేంద్రం’ బస్తర్ ప్రజల పాలిట కల్పతరువుగా మారనుందని తెలిపారు. ఒకప్పుడు ఆయుధాలు పట్టిన బలగాలతో నిండిన ప్రదేశాలు, ఇప్పుడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ఆశాకిరణాలుగా రూపాంతరం చెందాయి. ఈ సేవా కేంద్రాల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న సుమారు 371 సంక్షేమ, అభివృద్ధి పథకాల ప్రయోజనాలు ప్రజలందరికీ ఒకే గొడుగు కింద లభించనున్నాయి. రక్తపాతాన్ని పారద్రోలిన బస్తర్.. ఇప్పుడు సరికొత్త అభివృద్ధి ఉషోదయాన్ని ఆస్వాదిస్తోందని స్పష్టం చేస్తూ అమిత్ షా తన ప్రసంగాన్ని ముగించారు.