దేవాలయాల బంగారంపై కేంద్రం క్లారిటీ.
* గోల్డ్ మానిటైజేషన్’ వార్తలు పూర్తిగా అవాస్తవం.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయ ట్రస్టులు, మతపరమైన సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ‘గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్’ తీసుకురావాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను కేంద్రం తీవ్రంగా కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పోస్టులు, నివేదికలు పూర్తిగా అబద్ధమని, అవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా, నిరాధారమైనవిగా స్పష్టం చేసింది. దేవాలయాల వద్ద ఉన్న బంగారు నిల్వలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్లను జారీ చేయాలని యోచిస్తోందని, ఇందుకోసం గోల్డ్ మానిటైజేషన్ (బంగారం నగదీకరణ)కు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం అధికారికంగా వెల్లడించింది.
అలాగే దేవాలయాల గోపురాలు, గర్భగుడి తలుపులు లేదా ఇతర దేవాలయ నిర్మాణాలపై అమర్చిన బంగారు పూతలను ‘భారతదేశ వ్యూహాత్మక బంగారు నిల్వలు’ (స్ట్రాటజిక్ గోల్డ్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా)గా పరిగణిస్తారంటూ వస్తున్న వార్తలను కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి వదంతులను, ప్రచారాలను ప్రజలు ఏమాత్రం నమ్మవద్దని కోరింది. ధ్రువీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల అనవసరమైన గందరగోళం ఏర్పడి, ప్రజలు తప్పుదోవన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విధానపరమైన నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని సూచించింది. విధానపరమైన ప్రకటనలను అధికారిక పత్రికా ప్రకటనలు (ప్రెస్ రిలీజ్), ప్రభుత్వ వెబ్‌సైట్లు, ధ్రువీకరించిన పబ్లిక్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మాత్రమే తెలియజేస్తామని స్పష్టం చేసింది.
ఇంతకీ గోల్డ్ మానిటైజేషన్ అంటే ఏమిటంటే.. దేవాలయాల్లో ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం. ఆ బంగారం విలువకు సరిపోయేలా గోల్డ్ బాండ్లు జారీ చేసి, వాటిపై వడ్డీ రూపంలో ఆదాయం అందిస్తారు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే ‘బంగారాన్ని ఉత్పాదక ఆస్తిగా మార్చడం’ లేదా ‘బంగారం నగదీకరణ’ చేయడమే ఈ పథకం ఉద్దేశం. భారతదేశంలోని హిందూ దేవాలయాలకు పూర్వం రాజులు, జమీందారులు మణులు, మాన్యాలు, బంగారు ఆభరణాలు ధారాళంగా విరాళంగా ఇచ్చేవారు. ఆధునిక కాలంలోనూ ధనవంతులతో పాటు సామాన్య భక్తులు ఇచ్చే కానుకలు కూడా భారీగానే ఉంటాయి. ఇవన్నీ దేవాలయానికి ఆదాయ వనరులుగా ఉంటాయి. అధికారికంగా కచ్చితమైన లెక్కలు లేకపోయినా, ఈ దేవాలయాల వద్ద వేల కిలోల బంగారం ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.
హిందూ దేవాలయాల్లోని ఈ బంగారాన్ని సాధారణంగా సక్రియ ఆస్తులు, అదనపు కానుకలుగా విభజిస్తారు. దేవుని మూలవిరాట్టు, ఉత్సవ మూర్తులకు అలంకరించే సంప్రదాయ ఆభరణాలు, గర్భగుడి తలుపులు, ధ్వజ స్తంభాలు, ఆలయ విమాన గోపురాలకు వేసే బంగారు పూతలు మొదలైనవాటిని సక్రియ ఆస్తులుగా పరిగణిస్తారు. వీటిని ఇతర కార్యాలకు ఉపయోగించరు, మళ్లీ కరిగించరు. ఇవి కాకుండా భక్తులు హుండీల్లో వేసే చిన్నచిన్న బంగారు ఆభరణాలు, నాణెములు, బంగారు కడ్డీలు మొదలైనవాటిని అదనపు కానుకలుగా పరిగణిస్తారు. వీటిని నేరుగా పూజల్లో ఉపయోగించరు కాబట్టి, ఆలయ ట్రస్టులు భద్రత కారణాల దృష్ట్యా ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి మళ్లిస్తాయి. అంటే, ఈ బంగారాన్ని ప్రభుత్వ గుర్తింపు ఉన్న బ్యాంకు పథకాల్లో పెట్టుబడిగా పెడుతుంటాయి. పెద్ద పెద్ద దేవాలయాలకు భారీ స్థాయిలో వచ్చే ఈ బంగారాన్ని భారత ప్రభుత్వ మింట్‌కు తరలించి, కరిగించి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు బిస్కెట్లుగా లేదా కడ్డీలుగా మార్చి, ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతారు.






