ఏపీ అధికార టీడీపీ కూటమి, వైసీపీ మధ్య సోషల్ మీడియా పోస్టులపై తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ అంశంపై స్పందించారు. సోషల్ మీడియా ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసేలా ఉండాలని అభిలషించారు. కానీ, కొందరు సైకోలు సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారని తెలిపారు.
మానవ సంబంధాలు, రక్తసంబంధాలు మరిచి మృగాల్లా మారారని… తల్లి, చెల్లి అనే ఇంగితజ్ఞానం లేకుండా పోస్టులు పెట్టారని షర్మిల మండిపడ్డారు. ప్రశ్నించే మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షసానందం పొందారని విమర్శించారు.
“సోషల్ మీడియా సైకోల బాధితుల్లో నేను కూడా ఉన్నాను. అసభ్యకర పోస్టులతో పరువుప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరించారు. దారుణమైన పోస్టులతో పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాపై, నా తల్లిపై, నా సోదరి సునీతపై విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదని దారుణాతిదారుణంగా అవమానించారు. నా ఇంటి పేరు కూడా మార్చి రాక్షసానందం పొందారు.
నాపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై నేను కేసు పెట్టాను. సైకోలా పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. దారుణమైన పోస్టులు పెట్టేవారు ఏ పార్టీలో ఉన్నా వారి అంతు చూడాలి” అంటూ షర్మిల పేర్కొన్నారు.