Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌ది హిట్లర్ మనస్తత్వం….

Share

కాంగ్రెస్‌ది హిట్లర్ మనస్తత్వం.
* రేవంత్ రెడ్డిది రాజకీయ భయం.
* దేశంలో కేంద్రం సేకరించిన ధాన్యంలో సగానికి పైగా తెలంగాణ నుంచే.
*బాధ్యతలు నిర్వర్తించకుండా కేంద్రాన్ని నిందించడం హాస్యాస్పదం.
* ప్రాజెక్టులను ఏటీఎంగా మార్చుకుంటున్నారు.
* బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ధ్వజం.

హైదరాబాద్, మహా.
రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నమ్మకం లేదని, ఆ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించగా, నేడు కూడా కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ ధోరణితో ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతోందని విమర్శించారు. హిట్లర్ తరహా ఆలోచనలతో నడిచే ఏ రాజకీయ పార్టీ అయినా చివరికి ప్రజల తిరస్కారాన్నే ఎదుర్కొంటుందని, అందుకే ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య వేళ్లతో లెక్కించదగ్గ స్థాయికి పడిపోయిందని ఎద్దేవా చేశారు.
**రాష్ట్రపతి, ప్రధానిని కించపరచడం దారుణం**
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ నాయకత్వంపై వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఓబీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు గౌరవం ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ, కాంగ్రెస్ కుటుంబానికి మాత్రం రేవంత్ విధేయత చూపడం ఆయన సంకుచిత ఆలోచనా విధానాన్ని బయటపెడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం బీజేపీ జపం చేస్తున్నారని, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ల పేర్లు తప్ప ఆయనకు మరో అంశమే దొరకడం లేదన్నారు. ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ వేగంగా బలపడుతోందనే భయం, అసహనం కాంగ్రెస్ నాయకత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
**ధాన్యం కొనుగోళ్లలో అబద్ధాల వేట**
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రాంచందర్‌రావు గణాంకాలతో సహా నిలదీశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సేకరించిన 104.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ఒక్క తెలంగాణ నుంచే ఏకంగా 55.31 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించబడిందని స్పష్టం చేశారు. అంటే దేశవ్యాప్త సేకరణలో సగానికి పైగా తెలంగాణ నుంచే జరిగిందన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కింద దేశంలో రైతులకు చెల్లించిన రూ.21,243 కోట్లలో తెలంగాణ రైతులకే అత్యధికంగా రూ.13,171 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని, లబ్ధి పొందిన 11.69 లక్షల మంది రైతుల్లో 7,79,358 మంది మన రాష్ట్ర రైతులేనని వివరించారు. మార్చి 25 నుంచే ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 వరకు ప్రారంభించకుండా నెల రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోయిందని, బీజేపీ పోరాటాల తర్వాతే ప్రభుత్వం మేల్కొందని మండిపడ్డారు. రాబోయే పంట సీజన్‌లోనైనా రైతుల దగ్గరకు వెళ్లి ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
**అపాయింట్‌మెంట్ అబద్ధాలు.. మెట్రో నిధుల దాపరికం**
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు ముమ్మాటికీ అవాస్తవమని రాంచందర్‌రావు కొట్టిపారేశారు. తాను స్వయంగా ఫడ్నవీస్ కార్యాలయానికి ఫోన్ చేసి విచారించానని, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ఎలాంటి అధికారిక అభ్యర్థన రాలేదని వారు స్పష్టం చేశారని తెలిపారు. సీఎం చేయాల్సిన పనులను కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డే చేయాలనడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ మెట్రో పురోగతిలో కేంద్ర ప్రభుత్వ పాత్రను రేవంత్ సర్కార్ పూర్తిగా దాచిపెడుతోందని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ చేతుల మీదుగానే మెట్రోకు శంకుస్థాపన జరిగిందని, ఆర్థిక సహాయం, విధానపరమైన అనుమతులు ప్రతి దశలోనూ కేంద్రం అందించిందని గుర్తుచేశారు. మెట్రోను ఫలక్‌నుమాకు, మేడ్చల్ వైపు విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలస్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) భూసేకరణకు కేంద్రం నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు.
**ప్రాజెక్టులు మరో ఏటీఎంగా మారాయి**
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తమ స్వంత ఏటీఎంగా మార్చుకున్నట్లే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మరో ఏటీఎంగా మార్చే ప్రయత్నం చేస్తోందని, కమిషన్ల కోసమే ప్రాజెక్టులు నడుస్తున్నాయనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు రావాల్సిన నీటిని ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే నిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా, డీపీఆర్ లేకుండా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్, చేవెళ్ల, కామారెడ్డి, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించి “డిక్లేర్ అండ్ ఫర్గెట్” (ప్రకటించడం-మరచిపోవడం) విధానాన్ని అవలంబిస్తోందని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు. “జిత్నా కీచడ్ ఉఛాలోగే, ఉత్నా కమల్ ఖిలేగా” (మీరు ఎంత బురద జల్లితే అంతగా కమలం వికసిస్తుంది) అని పేర్కొంటూ, బీజేపీపై ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజా మద్దతుతో పార్టీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇకనైనా వ్యక్తిగత దూషణలు మాని, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.