- వి.బి.జి. రామ్-జీ పథకం అమలును వాయిదా వేయాలి
- రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా కొత్త ఉపాధి హామీ పథకం ప్రారంభం సరికాదు
- ప్రస్తుత పనులు పూర్తయ్యే వరకు వంద శాతం నిధులు కేంద్రమే భరించాలి
- శివరాజ్ సింగ్ చౌహన్ వీడియో కాన్ఫరెన్స్ లో తెల్చి చెప్పిన మంత్రి సీతక్క
హైదరాబాద్, మహా :
వి.బి.జి. రామ్-జీ పథక అమలును వాయిదా వేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా..మరో 20 రోజుల్లో నూతన ఉపాధి హమీ పథకాన్ని ప్రారంభించడం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలువున్న పనులు పూర్తయ్యే వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రకారమే వంద శాతం నిధులను కేంద్రం భరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్… రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వి.బి.జి. రామ్-జీ పథకానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాలను మంత్రి సీతక్క కేంద్రానికి తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ అమలులో దేశంలోనే ముందంజలో ఉందని, ప్రతి సంవత్సరం సగటున 12 కోట్ల పనిదినాలు కల్పిస్తూ గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో తగిన సంప్రదింపులు జరపకుండా కొత్త పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించడం వల్ల పరిపాలనా, ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణం సహా అనేక పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త విధానానికి మారడానికి తగిన సమయం అవసరమని పేర్కొన్నారు. కొత్త పథకం అమలును కనీసం రెండు నెలలు వాయిదా వేయాలని కేంద్రాన్ని సీతక్క కోరారు. ఉపాధీ హమీ చట్టానికి అనుగుణంగా ప్రారంభమైన పనులకు ప్రస్తుత విధానంలోనే చెల్లింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వి.బి.జి. రామ్-జీ పథకంలో వ్యవసాయ సీజన్‌లో తప్పనిసరిగా 60 రోజులపాటు పనులు నిలిపివేయాలనే నిబంధన గ్రామీణ పేద కుటుంబాల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం డిమాండ్ ఆధారితంగా ఏడాది పొడవునా కొనసాగాలని, గ్రామీణ కార్మికులకు అవసరమైన సమయంలో ఉపాధి కల్పించే వెసులుబాటు ఉండాలని సూచించారు. నిధుల కేటాయింపు విషయంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్ ఆధారిత విధానానికి బదులుగా స్థిరమైన కేటాయింపులను ప్రతిపాదించడం వల్ల అధిక డిమాండ్ ఉన్న సమయంలో నిధుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి పేర్కొన్నారు. గత ఐదేళ్ల పనిదినాల ఆధారంగా నిధులను నిర్ణయించడంతో పాటు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించి అదనపు నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. కొత్త పథకంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్య నిధుల విధానం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని మంత్రి సీతక్క వివరించారు. ప్రస్తుతం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏలో అమలవుతున్నట్లుగా నైపుణ్యం లేని కార్మికుల వేతనాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించడం, మెటీరియల్ వ్యయంలో 75 శాతం కేంద్రం వాటా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే గ్రామీణ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రాలకు ప్రత్యేక పనులను చేర్చుకునే స్వేచ్ఛ కల్పించాలని మంత్రి కోరారు. వ్యవసాయ అనుబంధ పనులు, రాష్ట్ర గృహ నిర్మాణ పథకాల వంటి పనులను అనుమతించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామీణ ఉపాధి కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేద కుటుంబాల జీవనోపాధి భద్రత లక్ష్యాలు దెబ్బతినకుండా కొత్త పథకంలో అవసరమైన మార్పులు, సడలింపులు కల్పించాలని సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.








