రూ. 2,400 కోట్ల కుంభకోణంలో కదులుతున్న డొంక.
• సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు.
• ఉచ్చులో పలువురు సినీ తారలు.
ఢిల్లీ, మహా.
వెండితెరపై ఆడిపాడే తారల వెనుక, ఆ తళుకుబెళుకుల వెనుక చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అమాయక ప్రజల ఆశలను ఆసరాగా చేసుకుని వేల కోట్లు కొల్లగొట్టిన ఓ భారీ ఆర్థిక కుంభకోణంలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ సన్నీ లియోన్ చిక్కుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. కర్ణాటక కేంద్రంగా సాగిన ఈ వందల కోట్ల మాయాజాలంలో సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటం దర్యాప్తు సంస్థలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజల కష్టార్జితమైన సుమారు రూ.2,400 కోట్లను స్వాహా చేసిన ‘శివమ్ అసోసియేట్స్’ బాగోతం ఇప్పుడు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సన్నీ లియోన్‌కు కర్ణాటక సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే.. కర్ణాటకకు చెందిన శివమ్ అసోసియేట్స్ అనే సంస్థ అధిక వడ్డీలు, ఆకర్షణీయమైన పథకాల పేరుతో అమాయక ప్రజలకు గాలం వేసింది. నమ్మకాన్ని పెట్టుబడిగా మలచుకుని ఏకంగా రూ.2,400 కోట్ల మేర అక్రమ డిపాజిట్లు సేకరించి, దారుణంగా మోసం చేసింది. ఈ భారీ మోసానికి సూత్రధారి, సంస్థ అధినేత శివానంద నీలణ్ణవర్. అడ్డదారిలో సంపాదించిన ఈ అపారమైన నల్లధనాన్ని అతడు సినీ రంగం వైపు మళ్లించినట్లు స్పష్టమవుతోంది. తన అక్రమ సామ్రాజ్యానికి వెండితెర గ్లామర్‌ను అద్దే ప్రయత్నంలో భాగంగా 2023లో ‘ఛాంపియన్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా ద్వారానే సన్నీ లియోన్ ఈ వివాదంలోకి ప్రవేశించింది.
ఛాంపియన్ సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో (ఐటెం సాంగ్) నర్తించేందుకు సన్నీ లియోన్‌ను సంప్రదించిన శివానంద.. ఆమెకు పారితోషికంగా ఏకంగా కోటి రూపాయలు చెల్లించినట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో, బ్యాంక్ లావాదేవీల రికార్డుల ద్వారా బట్టబయలైంది. అయితే, ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. సన్నీ లియోన్‌కు చెల్లించిన ఆ భారీ పారితోషికం.. సామాన్య ప్రజల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్ము నుంచే ఇచ్చారా? అనే కీలక కోణంలో ఇప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఆర్థిక లావాదేవీల వ్యవహారంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలంటూ కర్ణాటక సీఐడీ అధికారులు ఆమెకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. బ్యాంకు ఖాతాల వివరాలతో సహా విచారణకు సహకరించాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ భారీ కుంభకోణం సెగ కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు, శాండల్‌వుడ్‌ను (కన్నడ చిత్ర పరిశ్రమ) కూడా తీవ్రంగా తాకింది. ప్రజల వద్ద నుంచి దోచుకున్న సొమ్ముతో శివమ్ అసోసియేట్స్ గత డిసెంబర్‌లో ‘కన్నడ ఉత్సవం’ పేరిట భారీ ఎత్తున వేడుకలను నిర్వహించింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అగ్రశ్రేణి కన్నడ తారలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు గాను ఆయా తారలకు భారీ స్థాయిలోనే పారితోషికాలు ముట్టజెప్పినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆర్థిక నేరగాళ్లు ఇలా విలాసవంతమైన ఈవెంట్ల ద్వారా తమ అక్రమ ధనాన్ని చలామణి చేయడం పోలీసులను సైతం విస్తుపోయేలా చేస్తోంది.
దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన సీఐడీ అధికారులు.. కన్నడ నాట విశేషమైన క్రేజ్ ఉన్న ప్రముఖ నటులు ‘డాలి’ ధనుంజయ్, కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సప్తమీ గౌడ, వశిష్ఠ సింహ, రాగిణి ద్వివేదిలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. వీరందరూ ఆ ఉత్సవానికి ఎలా హాజరయ్యారు? వారికి అందిన పారితోషికం ఎంత? తదితర వివరాలను రాబట్టేందుకు విచారణాధికారులు సన్నద్ధమవుతున్నారు. కష్టజీవుల రక్తాన్ని పీల్చి పోగుచేసిన డబ్బుతో వేడుకలు నిర్వహించడం, అందులో సినీ తారలు భాగస్వాములు కావడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.








