Mahaa Daily Exclusive

  అమరావతికి గుడ్ న్యూస్

Share

  • అమరావతికి గుడ్ న్యూస్
  • సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టుకు కేంద్రకేబినెట్ ఆమోదం
  • ఐదు ఎకరాల్లో.. ఆఫీస్ కాంప్లెక్స్

ఢిల్లీ, మహా : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం భారీ శుభవార్త తెలిపిందని కేంద్రం ఆరోగ్య, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. అమరావతిలో రూ.2,500 కోట్ల విలువైన సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర పడిందని వివరించారు. దీనిని ఐదు ఎకరాల్లో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందన్నారు. రెండు భారీ టవర్లలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారని వివరించారు. అలాగే1,800 కార్ల పార్కింగ్ సదుపాయంతో ఈ ఆధునిక కార్యాలయ సముదాయం నిర్మితమవుతుందని చెప్పారు. రూ.1,234 కోట్లతో 17 ఎకరాల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తారని తెలిపారు. 11 టవర్లలో 1,568 నివాస క్వార్టర్లు నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, కమ్యూనిటీ హాల్స్, ఆధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు అవుతుందని కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2018లో ఈ ప్రతిపాదన చేస్తే.. 2024 తర్వాత ఇది వేగంగా ముందుకు సాగిందని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖల సహకారంతో ఈ ప్రాజెక్ట్‌‌కు ఆమోద ముద్ర పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ఈ ప్రాజెక్ట్ సాధ్యమైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.