Mahaa Daily Exclusive

  ప్రాణాలతో బయటపడ్డా..

Share

ప్రాణాలతో బయటపడ్డా..
* కానీ ప్రతిక్షణం నరకమే అనుభవిస్తున్నా.
* ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ.. అయినా వీడని పీడకలలు.
* ఎయిరిండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో మిగిలిన ఏకైక వ్యక్తి విశ్వకుమార్ రమేష్ ఆవేదన.

ఢిల్లీ, మహా.

ఒక ఘోరమైన విమాన ప్రమాదం.. కళ్లెదుటే వందలాది మంది సజీవ దహనం.. ఆ మృత్యు జ్వాలల నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి అతడు. బయటి ప్రపంచం దృష్టిలో అతనొక అదృష్టవంతుడు. కానీ, ఆ భయానక ఘటన మిగిల్చిన గాయాలు దేహానివి కావు, మనసువి! ప్రాణాలతో మిగలడం అంటే కేవలం ఊపిరి పీల్చడం మాత్రమే కాదని, ప్రతిరోజూ, ప్రతిక్షణం ఓ మానసిక నరకాన్ని అనుభవించడమేనని ఆ బాధితుడు కన్నీటిపర్యంతమవుతున్నాడు. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వకుమార్ రమేష్ పంచుకున్న భావోద్వేగపూరితమైన అనుభవాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తున్నాయి.
తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి బెడ్‌పై అపస్మారక స్థితి నుంచి కోలుకుంటున్న రమేష్‌ను ప్రధాని మోదీ ఎంతో ఆవేదనగా చూస్తూ పలకరించి, ఆయనకు మనోధైర్యం కల్పించారు. నీలం రంగు ఆసుపత్రి దుస్తుల్లో, చేతికి పెద్ద కట్టుతో, ముఖంపై గాయాలతో నిస్సహాయంగా ఉన్న బాధితుడి దీనస్థితిని, ఆయన ఆరోగ్య పరిస్థితిని పక్కనే ఉన్న వైద్యులు ప్రధానికి వివరిస్తున్న ఆ చిత్రం.. ఆనాడు ఆ ప్రమాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో, ఎంతటి విషాదాన్ని నింపిందో కళ్లకు కడుతోంది. ఆపత్కాలంలో దేశ ప్రధాని స్వయంగా వచ్చి ఓదార్చినప్పటికీ, నాటి పీడకలలు మాత్రం రమేష్‌ను నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి.
బ్రిటిష్ పౌరుడైన విశ్వకుమార్ రమేష్ ఆ నాటి భయానక ఘటనను తలుచుకుంటూ నేటికీ కుమిలిపోతున్నారు. ప్రపంచం తాను ప్రాణాలతో బయటపడటాన్ని మాత్రమే గుర్తిస్తోందని, కానీ ప్రతిరోజూ తాను గుండెల్లో మోస్తున్న అంతులేని మానసిక భారాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం నుంచి తాను ప్రాణాలతో బయటపడటాన్ని చూస్తున్న ప్రజలకు, తన లోపల చెలరేగుతున్న కల్లోలం, తాను పడుతున్న క్షోభ కనిపించడం లేదన్నారు. తాను ఇప్పటికీ నిద్రలేమితో బాధపడుతున్నానని, భయంకరమైన జ్ఞాపకాలు తనను అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాయని, ఏడాది గడిచినప్పటికీ తన జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి తీవ్రంగా కష్టపడుతున్నానని చెప్పారు.
గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లోని మేఘనినగర్‌లో ఉన్న ఒక వైద్య కళాశాల హాస్టల్ ప్రాంగణంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దారుణమైన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, నేలమీద ఉన్న 19 మందితో సహా మొత్తం 260 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ నాడు విమానంలోని 11A సీటులో ఉన్న రమేష్ ప్రమాదం జరిగిన వెంటనే, విరిగిపోయిన ఒక అత్యవసర ద్వారం గుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటపడగలిగారు. అయితే ఆ ప్రమాదం రమేష్ కు కేవలం భయాన్ని మాత్రమే కాదు, తీరని శోకాన్ని కూడా మిగిల్చింది. ఆయనకు కేవలం కొన్ని వరుసల ముందు కూర్చున్న అతని సోదరుడు అజయ్ కూడా ఆ మృత్యువాత పడ్డారు. సోదరుడి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ దారుణ ఘటనతో రమేష్ తీవ్రమైన మానసిక ఆందోళన సమస్య (పోస్ట్-ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సమస్య కారణంగా ఆయన తన కుటుంబ జీవితానికి పూర్తిగా దూరమయ్యారు. తాను ఇప్పుడు ఒంటరిగా ఉన్నానని, గదిలో ఒంటరిగా కూర్చుని తన భార్యతో గానీ, కన్న కొడుకుతో గానీ కనీసం మాట్లాడలేకపోతున్నానని ఆయన తన కుంగుబాటును వివరించారు. ఈ ప్రమాదం తర్వాత విశ్వకుమార్ రమేష్‌ను ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ ప్రతినిధులు నిరంతరం సంప్రదిస్తూ ఆయనకు తగిన మద్దతు లభించేలా కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా, ప్రమాదం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బాధితుల కుటుంబాలు ఆ చీకటి రోజును తలచుకుని కన్నీరుమున్నీరవుతూ.. ఆ ఘోర విపత్తుకు గల అసలు కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థల తుది నివేదిక కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.