Mahaa Daily Exclusive

  గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు…

Share

గల్ఫ్‌లో వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు.
* భారత్‌ తీవ్ర ఆగ్రహం.
* నాలుగు రోజుల్లో మూడుసార్లు దాడి.
* వారంలో రెండోసారి యూఎస్‌ దౌత్యవేత్తకు సమన్లు.
* ముగ్గురు భారతీయ నావికుల మృతిపై ఢిల్లీ తీవ్ర ఆందోళన.
* 18 వేల మంది సిబ్బందికి డిజిఎస్ హై అలర్ట్.
ఢిల్లీ, మహా
గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దళాలు వరుస దాడులకు తెగబడటంపై యావత్ భారతదేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒమన్ తీరంలో భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌకపై అమెరికా తాజాగా జరిపిన దాడి దేశౌన్నత్యాన్ని, సముద్ర భద్రతను తీవ్రంగా ప్రశ్నించేలా మారింది. ఈ దారుణ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే భారతీయ సిబ్బంది లక్ష్యంగా అమెరికా మూడుసార్లు దాడులకు పాల్పడటంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, భారత్‌లో ఉన్న అమెరికా దౌత్యవేత్త జాసన్ మీక్స్‌కు విదేశాంగ శాఖ అత్యవసర సమన్లు జారీ చేసింది. ఒకే వారంలో అమెరికా రాయబార కార్యాలయ ఉన్నతాధికారిని పిలిపించి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. సౌతా బ్లాక్‌కు పిలిపించుకుని మరీ వరుసగా జరుగుతున్న దాడులపై తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను దౌత్యవేత్తకు భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, తమ పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఊరుకునేది లేదని ఢిల్లీ గట్టి హెచ్చరికలు పంపింది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్, హార్ముజ్ జలసంధి సహా సమీప సముద్ర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ నావికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 18 వేల మంది భారతీయ సిబ్బందికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) అత్యవసర భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నందున, సిబ్బంది అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను పక్కాగా పాటించాలని సూచించింది. ప్రస్తుతం అత్యంత సమస్యాత్మకంగా మారిన హార్ముజ్ జలసంధికి సమీపంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న 13 వాణిజ్య నౌకలు ఉన్నాయని, వాటిల్లో 622 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. వీరితో పాటు గల్ఫ్ ప్రాంతంలో వందలాది విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో దాదాపు 18 వేల మంది భారతీయులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సముద్ర కార్మిక శక్తి కలిగిన దేశంగా భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందువల్ల సముద్ర భద్రతకు ఏ చిన్న ముప్పు వాటిల్లినా, ప్రపంచంలోనే అత్యధికంగా ప్రభావితమయ్యే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది.
గత కొన్ని రోజులుగా సముద్రంలో చోటుచేసుకున్న దాడుల వివరాలను పరిశీలిస్తే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది. జూన్ 8వ తేదీన ‘ఎంటీ మారివెక్స్’ అనే నౌకపై జరిగిన దాడితో ఆ ఓడలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, అందులో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆ ఊరట ఎంతోకాలం నిలవలేదు. జూన్ 10వ తేదీన ఒమన్ తీరంలో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టేబెల్లో’ అనే ట్యాంకర్‌పై జరిగిన మరో దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయులు ఉండగా, వారిలో 21 మంది క్షేమంగా బయటపడినప్పటికీ, ముగ్గురు భారతీయ నావికులు ఈ దాడిలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం జరిగిన మరుసటి రోజే, అంటే గురువారం నాడు, మరో వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడికి తెగబడ్డాయి. ఇలా వరుసగా జరుగుతున్న దాడుల పరంపర అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని, భారతీయ నావిక రంగాన్ని తీవ్ర భయాందోళనల్లోకి నెట్టేసింది. ఈ సంక్షోభానికి ముగింపు పలికేలా అమెరికా తక్షణమే తన దాడులను ఆపాలని, భారతీయ పౌరుల భద్రతకు పూర్తి గ్యారెంటీ ఇవ్వాలని భారత్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.