Mahaa Daily Exclusive

  కాంగ్రెస్‌ పెద్దల పక్షపాతి…

Share

కాంగ్రెస్‌ పెద్దల పక్షపాతి.
* రేవంత్ పాలనలో బూతుల మోతే!
* మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజం.
* మడికొండలో బీఆర్ఎస్ శిక్షణా తరగతులు.
* ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా సంక్షోభమేనని విమర్శ.
మడికొండ, మహా.
బీఆర్ఎస్ హయాంలో తాము పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని నేతలు మాత్రం కేవలం పెద్దలను, బడాబాబులను మాత్రమే చూసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మడికొండలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్, సోషల్ మీడియా శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చెప్పిన పచ్చి అబద్ధాలను నమ్మే ప్రజలు ఆ పార్టీకి పట్టంకట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకునే ఇందిరమ్మ రాజ్యం అంటే.. వాస్తవానికి ఇంటింటా సంక్షోభమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, పంటల కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. తమపై ప్రజల్లో ఉన్న మమకారం ఏమాత్రం తగ్గలేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా ఇప్పటికీ గులాబీ జెండా రెపరెపలే కనిపిస్తున్నాయన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అది తమకే సొంతమని ఎవరూ విర్రవీగకూడదని హితవు పలికారు. దేశం మొత్తం కాంగ్రెస్ అనే దరిద్రాన్ని వదిలించుకుంటే.. తెలంగాణ ప్రజలు మాత్రం వారు ఇచ్చిన 420 హామీలకు మోసపోయి అధికారం కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్లు రాసిచ్చి పథకాల వరద పారిస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీశారు. సీఎం రేవంత్ నోరు తెరిస్తే బూతుల బురద చల్లడం తప్ప, రాష్ట్రంలో ఇసుమంత అభివృద్ధి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కండలు తిరిగిన ఉస్తాదు అయినా మూడు నెలల్లో పిల్లలను పుట్టిస్తారా అని సీఎం రేవంత్ అంటున్నారని.. మూడు నెలల్లో పిల్లలు పుట్టరనే విషయం తమకూ తెలుసని, కానీ 30 నెలలైనా పుట్టకపోతే ఏమనాలని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రేవంత్ రెడ్డి పాలన అంతా బూతుల మోతలు, పచ్చి అబద్ధాలతోనే కొనసాగుతోందని మాజీ మంత్రి విమర్శించారు. రాష్ట్ర పాలనను ఢిల్లీ చేతుల్లో పెడితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వంద సార్లు ఢిల్లీకి చుట్టాలు గీసిన సీఎం రేవంత్.. రాష్ట్రానికి వంద పైసలైనా తీసుకొచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. ఇక్కడ రైతులు కష్టాల్లో అల్లాడుతుంటే.. సీఎం మాత్రం డబ్బుల సంచులన్నీ ఢిల్లీ పెద్దలకు పంపిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకానికి మంగళం పాడిందని, మళ్లీ పాత రోజుల తరహాలో యూరియా బస్తాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడే దుస్థితిని తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గత 30 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని, చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.