సీషెల్స్ స్వర్ణోత్సవాల్లో భారత సైనిక గర్జన.
* లేచి నిలబడి సెల్యూట్ చేసిన ప్రధాని మోదీ.
* విక్టోరియా వీధుల్లో మారుమోగిన ‘బడ్లు రామ్ కా బదన్’..
* మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం.
ఢిల్లీ, మహా.
భారత్, సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చిరకాల రక్షణ, స్నేహ బంధం ప్రపంచ వేదికపై మరోసారి సగర్వంగా ఆవిష్కృతమైంది. సీషెల్స్ దేశ 50వ స్వాతంత్ర్య దినోత్సవ (గోల్డెన్ జూబ్లీ) వేడుకల్లో భారత సాయుధ దళాలు నిర్వహించిన కవాతు నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్ వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విక్టోరియా వీధుల్లో భారత సైనికులు శౌర్యంతో అడుగులు వేస్తుంటే, ప్రధాని మోదీ లేచి నిలబడి వారికి గౌరవ వందనం సమర్పించడం ఈ వేడుకలకే హైలైట్‌గా నిలిచింది.
సీషెల్స్ రాజధాని విక్టోరియాలో జరిగిన ఈ స్వర్ణోత్సవ పరేడ్‌లో భారత ఆర్మీకి చెందిన వీరత్వానికి ప్రతీక అయిన అస్సాం రెజిమెంట్ జవాన్లు, భారత నౌకాదళ సిబ్బంది సంయుక్తంగా కవాతు నిర్వహించారు. ముఖ్యంగా అస్సాం రెజిమెంట్ సైనికులు తమ ప్రసిద్ధ రెజిమెంటల్ గీతం బడ్లు రామ్ కా బదన్ జమీన్ కా నీచే హై.. తో క్యా హువా హమే ఉస్కా రేషన్ మిల్తా హై’ అంటూ ఉత్సాహంగా పాడుతూ మార్చ్ చేస్తుంటే అక్కడి ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. భారత నౌకాదళ బ్యాండ్ బృందం పలికించిన స్వరాలు, మార్చింగ్ కంటింజెంట్ క్రమశిక్షణ ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి.
ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగంగా హిందూ మహాసముద్రంలో భారత్-సీషెల్స్ సముద్ర సహకారానికి ప్రతీకగా భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తార్కష్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్‌ఎస్ ఇక్షాక సర్వే నౌకలు ప్రత్యేకంగా పాల్గొన్నాయి. ఈ యుద్ధనౌకల భాగస్వామ్యం ఇరు దేశాల మధ్య రక్షణ రంగ అనుసంధానాన్ని మరింత శిఖరాగ్రానికి తీసుకెళ్లిందని భారత నౌకాదళం అధికారికంగా ప్రకటించింది. పరేడ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ అద్భుతమైన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత సైనిక దళాల కవాతు ఇరు దేశాల చిరస్థాయి స్నేహానికి సజీవ సాక్ష్యమని కొనియాడారు.
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సముద్ర రక్షణ, పర్యావరణ పరిరక్షణలో ఆయన అందిస్తున్న విశేష సేవల గుర్తింపుగా సీషెల్స్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ లభించింది. ఆదివారం జరిగిన ఒక ప్రత్యేక అధికారిక కార్యక్రమంలో సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని మోదీకి బహూకరించి సత్కరించారు. ఈ పురస్కారం ద్వారా భారత దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మరో మెట్టు ఎక్కిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.








