Mahaa Daily Exclusive

  హర్మూజ్‌ దిగ్బంధనాన్ని దాటిన భారత్….

Share

హర్మూజ్‌ దిగ్బంధనాన్ని దాటిన భారత్.
* ప్రపంచ ఇంధన సంక్షోభంపై మోదీ సర్కార్ ‘మాస్టర్ ప్లాన్’!
* నాలుగు నెలల పాటు మూతపడినా దేశంలో తగ్గని చమురు సరఫరా.
* రహస్యాలను వెల్లడించిన కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ.
ఢిల్లీ, మహా.
ప్రపంచాన్ని వణికించిన అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని భారతదేశం అత్యంత సమర్థవంతంగా, చాకచక్యంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ సగర్వంగా ప్రకటించారు. అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని దాదాపు నాలుగు నెలల పాటు మూసివేసినప్పటికీ, దేశంలో ఇంధన, వంటగ్యాస్ సరఫరాకు ఎలాంటి విఘాతం కలగకుండా మోదీ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలతో అడ్డుకట్ట వేసిందని ఆయన వెల్లడించారు. ఆ క్లిష్ట సమయంలో ఎలాంటి టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఏకంగా 12కు పైగా ఎల్‌పీజీ నౌకలను హర్మూజ్‌ జలసంధి గుండా సురక్షితంగా భారత్‌కు తరలించగలిగామని మంత్రి చారిత్రాత్మక విషయాలను పంచుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో తీసుకున్న ముందస్తు చర్యల వల్లే ఈ అసాధ్యమైన విజయం సాధ్యమైందని పురీ స్పష్టం చేశారు. ముడిచమురు దిగుమతుల కోసం కేవలం ఒకట్రెండు దేశాలపైనే ఆధారపడే పాత పద్ధతికి స్వస్తి పలికి, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురును తెప్పించామని చెప్పారు. అంతటితో ఆగకుండా, దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని ఊహించని రీతిలో పెంచినట్లు వివరించారు. ఇంతకుముందు వంటగ్యాస్ ఉత్పత్తి చేయని రిఫైనరీలను సైతం కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే సాంకేతికంగా మార్పు చేసి, ఎల్‌పీజీ తయారీకి సిద్ధం చేశామని తెలిపారు. ఫలితంగా దేశంలో రోజుకు 35 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న వంటగ్యాస్ ఉత్పత్తిని ఏకంగా 54 వేల మెట్రిక్ టన్నులకు పెంచి సరికొత్త రికార్డు సృష్టించామన్నారు.

జాతీయంగా వంటగ్యాస్ కొరత అనే మాటే రాకుండా ఉండేందుకు మోదీ సర్కార్ అల్జీరియా, జపాన్, కెనడా వంటి దేశాలతో అప్పటికప్పుడు కొత్త సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుందని మంత్రి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ, అమెరికా నుంచి అదనపు ఎల్‌పీజీ కార్గోలను భారత్‌కు రప్పించి దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చగలిగామని చెప్పారు. ఒకవైపు అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండుతున్నా, దేశీయంగా సామాన్యులపై పైసా భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి చారిత్రాత్మక ఊరటనిచ్చిందని గుర్తుచేశారు. ఇదే సమయంలో ఇంధన దుర్వినియోగాన్ని, బ్లాక్ మార్కెట్‌ను పూర్తిగా అరికట్టేందుకు వంటగ్యాస్ పంపిణీలో డిజిటల్ అథెంటికేషన్ విధానాన్ని తప్పనిసరి చేశామని, ఈ వ్యూహాత్మక చర్యల వల్లే ప్రపంచాన్ని కుదిపేసిన సంక్షోభం భారత వినియోగదారులను తాకలేకపోయిందని హర్దీప్ సింగ్ పురీ స్పష్టం చేశారు.