- మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్గ్ వీడియోలు
- సైబర్ నేరస్థులపై పోలీసులకు ఫిర్యాదు
- మంత్రి తరఫున ఫిర్యాదు చేసిన లాయర్ శశిభూషణ్
హైదరాబాద్, మహా : సైబర్ నేరగాళ్లు సామాన్యులు, ఉద్యోగులను మాత్రమే కాదు.. మంత్రులను సైతం టార్గెట్ చేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ దంపతులపై సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన మార్ఫింగ్ వీడియోలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో అభ్యంతరకర కంటెంట్‌తో కూడిన వీడియోలను పోస్టు చేస్తూ, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా కుట్రలు జరుగుతున్నాయని లాయర్ శశిభూషణ్ కాశే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతమైన పదవులు, స్థానాల్లో ఉన్న వారి ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ఈ వెకిలి పనులు చేస్తున్నారని, అందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
సరికొత్త ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ నకిలీ వీడియోలు క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారని లాయర్ శశిభూషణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిధుల అక్రమాలకు సంబంధించిన అంశంలో మంత్రి శ్రీధర్ బాబును తప్పుడు రీతిలో చిత్రీకరిస్తూ ఈ ఫేక్ వీడియోలను సర్క్యూలేట్ చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ మంథని అనే ఫేస్‌బుక్ పేజీ ద్వారా సైతం దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు లాయర్ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








