- రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదు
- రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలి కానీ శత్రువులుగా కాదు
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- టి.డి. జనార్ధన్ కు రసం రసమయి- ఎన్టీఆర్ పురస్కారం ప్రదానం
హైదరాబాద్, మహా : తెలుగు వారందరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలన్నది అందరి ఆకాంక్ష కావాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సూచించారు. మంగళవారం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 104 వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టి.డి. జనార్ధన్ కు ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేసిన కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రసమయి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని, ప్రత్యర్థి పార్టీల వారిని శత్రువులుగా చూస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, ఇది సరికాదన్నారు. రాజకీయాల్లో అవతల వారిని ప్రత్యర్థిగా భావించాలి కానీ, శత్రుత్వ భావన సరికాదన్నారు.
పాలనాపరంగా రెండు రాష్ట్రాలుగా విడిపోవడం మంచిదేనని, అయితే తెలుగువారిగా సోదర భావంతో కలసి మెలసి మెలగాలన్నది అందరి ఆకాంక్ష కావాలన్నారు. అనవసర కలహాలు, అనవసర వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. నందమూరి తారకరామారావు గొప్ప పరిపాలన దక్షుడని, సంస్కరణ అభిలాషి అని, రాజకీయాల్లో సంస్కరణలను అమలులోకి తెచ్చిన గొప్ప నేత అని చెప్పారు. ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించడంతోపాటు వారికి ఒక అన్నగా నిత్యం అండగా ఉండేవారన్నారు. వెనకబడిన వర్గాల వారికి రాజకీయ అవకాశాలు కల్పించి, వారు ఎదగడానికి అండదండలు అందించిన గొప్ప నాయకుడన్నారు. ఆయన నిత్యం ప్రజల గురించే ఆలోచించే వారిని ప్రజల జీవితాల్లో మెరుగు తీసుకురావాలని ఎప్పుడూ తపించేవారని చెప్పారు.
నందమూరి తారక రామారావు ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ ఆయన గొప్ప జాతీయవాది అని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలన్నారు. టి. డి జనార్దన్ తొలినుంచి ఒకటే సిద్ధాంతానికి కట్టుబడి, అంకిత భావంతో క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తి అని, రాజకీయాల్లో ఇటువంటి వారు రావలసిన అవసరం ఉందని,యువతరం ఇటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇంట్లో తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసుకోవాలని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు సూచించారు.
59 ఏళ్లుగా ఎన్నో ఉత్కృష్టమైన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమతో ఏటా ఈ పురస్కారాన్ని రసమయి సంస్థ అందిస్తోందని గుర్తు చేస్తూ సంస్థ అధ్యక్షులు రామును, నిర్వహణ బృందాన్ని అభినందించారు కార్యక్రమంలో హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నరసింహప్ప తదితరులు పాల్గొన్నారు.








