Mahaa Daily Exclusive

  ప్రభుత్వానివి కల్లబొల్లి లెక్కలు……

Share

ప్రభుత్వానివి కల్లబొల్లి లెక్కలు.
* రైతు భరోసా పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు.
* కాంగ్రెస్ హామీల అమలుపై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం.
* వ్యవసాయ నిధులపై సీఎం, డిప్యూటీ సీఎం లెక్కల్లో పొంతన లేదని విమర్శ.
హైదరాబాద్, మహా.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘రైతు భరోసా’ పేరుతో కొత్త డ్రామాలకు తెరతీసిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం.. వాస్తవానికి రైతుల సమస్యల పరిష్కారంలో ఏమాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని మండిపడ్డారు.
రైతుల కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించినట్లు చెబుతున్న లెక్కలన్నీ బూటకమేనని హరీశ్‌రావు ఆరోపించారు. ఒకే సభలో ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని ప్రకటిస్తే, అదే సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లెక్కలు నిజమా? ఆర్థిక మంత్రి లెక్కలు నిజమా? అని ప్రశ్నించిన ఆయన.. ఈ అయోమయంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. 2027 మార్చి నెలాఖరు వరకు వ్యవసాయ రంగానికి ఉన్న మొత్తం బడ్జెట్ కేటాయింపులే సుమారు రూ.82 వేల కోట్లుగా ఉంటే.. 2026 జూన్ నాటికే లక్షా 56 వేల కోట్లు లేదా లక్షా 75 వేల కోట్లు ఎలా ఖర్చు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. బడ్జెట్‌లో లేని నిధులను ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేశారో చెప్పాలని, రైతులను తప్పుదోవ పట్టించేందుకే కల్పిత లెక్కలు సృష్టిస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ సర్కార్ రైతులను నిలువునా మోసం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక కేవలం స్వల్పకాలిక రుణాలకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం రైతాంగాన్ని వంచించడమేనని దుయ్యబట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పి, గద్దెనెక్కిన తర్వాత మాట మార్చడం కాంగ్రెస్ నయవంచన వైఖరికి నిదర్శనమన్నారు. ఇకనైనా ప్రచార ఆర్భాటాలు కట్టిపెట్టి, రైతులకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. రైతులకిచ్చిన వాగ్దానాల అమలుపై శాసనసభతో పాటు మరే వేదికపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు ప్రభుత్వానికి సవాల్ విసిరారు.