Mahaa Daily Exclusive

  ఖనిజ సంపదపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్…

Share

ఖనిజ సంపదపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్.
*ఆదాయం పెంపే లక్ష్యంగా ‘మినరల్ మ్యాపింగ్’కు ఆదేశం.
*అరుదైన ఖనిజాల వెలికితీతకు మూడు రాష్ట్రాలతో క్లస్టర్ ఏర్పాటుపై సూచన.
* ఉచిత ఇసుకపై టెక్నాలజీతో నిరంతర నిఘా.. అక్రమాలకు తావుండొద్దు.
అమరావతి, మహా.
రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అపారమైన ఖనిజ సంపదను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖనిజ నిక్షేపాలను శాస్త్రీయంగా గుర్తించేందుకు సమగ్రమైన ‘మినరల్ మ్యాపింగ్’ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేవలం ముడి ఖనిజాలను వెలికితీసి పంపడమే కాకుండా, వాటికి రాష్ట్రంలోనే విలువ జోడించే (వాల్యూ యాడిషన్) ప్రక్రియలను, పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందాలని స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలోని కొన్ని రాష్ట్రాలు కేవలం ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయంతోనే రెవెన్యూ మిగులు సాధిస్తున్నాయని గుర్తుచేశారు. మన రాష్ట్రంలోనూ ఖనిజ సంపదకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ఆర్థికంగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీ (APMDC) ద్వారా ఈ అవకాశాలను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై తక్షణమే నిపుణులతో లోతైన అధ్యయనం చేయించి, ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించాలన్నారు. బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యూమినా వంటి విలువైన ఖనిజాలకు ఇక్కడే విలువ జోడింపు ప్రక్రియలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్, అణు ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాల్లో కీలకంగా ఉపయోగపడే అరుదైన భూ ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్) వెలికితీతపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో లభ్యమయ్యే ఈ ఖనిజాల కోసం ఒక ఉమ్మడి క్లస్టర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ వంటి అత్యంత విలువైన ఖనిజాల నిల్వలను కచ్చితంగా అంచనా వేయాలన్నారు. అలాగే, రాష్ట్రంలోని జొన్నగిరితో పాటు చిత్తూరు జిల్లా చిగురుగుంట ప్రాంతాల్లో ఉన్న బంగారం నిల్వలపై మరింత లోతుగా అధ్యయనం చేసి, ఇతర బ్లాకుల్లోనూ సరికొత్త అన్వేషణ జరపాలని గనుల శాఖకు సూచించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్, ఇతర విలువైన ఖనిజ నిక్షేపాలను గుర్తించినట్లు అధికారులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించారు.
మరోవైపు, ప్రజలకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఉచిత ఇసుక విధానంలో పూర్తి పారదర్శకత ఉండాలని, అక్రమాలకు ఎక్కడా తావులేకుండా చూడటానికి ఆధునిక టెక్నాలజీని వంద శాతం వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్ల భారీ ఆదాయాన్ని వదులుకుని ఇసుకను ఉచితంగా అందిస్తోందని, ఈ ఆశయం దెబ్బతినకుండా, ఇసుక దుర్వినియోగం కాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు, శాటిలైట్ చిత్రాల ద్వారా నిరంతర నిఘా ఉంచాలని, ఇసుక రవాణా చేసే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతూనే రాష్ట్రానికి గరిష్ట ఆదాయం సమకూరేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ అత్యంత కీలకమైన సమీక్షా సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.