సైన్యాధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతల స్వీకారం.
* పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో నియామకం.
* సరిహద్దు సవాళ్లు, సైన్య ఆధునికీకరణపై నూతన ఆర్మీ చీఫ్ ప్రత్యేక దృష్టి.
* వ్యూహాత్మక దళాల నిర్వహణలో 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం.
ఢిల్లీ, మహా.
భారత నూతన సైన్యాధిపతిగా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్) జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. భారతీయ సైన్యానికి ఆయన 31వ అధిపతిగా వ్యవహరించనున్నారు. సాయుధ దళాల్లో సుమారు 40 ఏళ్లకు పైగా విశేష సేవలందించి పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. జనరల్ ధీరజ్ సేథ్ ఈ అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. సుమారు 13 లక్షల మంది సైనికులు కలిగిన ప్రపంచంలోని అత్యంత భారీ సైన్యాల్లో ఒకటైన భారత ఆర్మీకి ఆయన ఇకపై నాయకత్వం వహించనున్నారు.
**అరుదైన ఘనత, అపార అనుభవం**
ఖడక్వాస్లాలోని ప్రతిష్ఠాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పూర్వ విద్యార్థి అయిన జనరల్ సేథ్.. డిసెంబర్ 1986లో ఆర్మర్డ్ కార్ప్స్ విభాగం ద్వారా సైన్యంలో అడుగుపెట్టారు. 31వ సైన్యాధిపతిగా అత్యున్నత పీఠాన్ని అధిష్టించడానికి ముందు ఆయన భారత సైన్యానికి ఉప సైన్యాధిపతిగా (వైస్ చీఫ్) విశేష సేవలందించారు. ఆర్మీ కమాండర్ స్థాయికి ఎదిగిన తర్వాత ఆయన జైపుర్ కేంద్రంగా ఉన్న సౌత్ వెస్ట్రన్ కమాండ్, అలాగే పుణెలోని సదరన్ కమాండ్ల జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా విజయవంతంగా పనిచేశారు. ముఖ్యంగా పశ్చిమ సరిహద్దులోని ఈ రెండు కీలక ఆపరేషనల్ కమాండ్లకు నాయకత్వం వహించిన అత్యంత అరుదైన ఘనతను జనరల్ ధీరజ్ సేథ్ సొంతం చేసుకోవడం విశేషం.
**సవాళ్లను దీటుగా ఎదుర్కొనే దిశగా..**
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భద్రతా పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. సరికొత్త సాంకేతికతలు, ఆధునిక యుద్ధ పద్ధతుల వల్ల దేశ సరిహద్దుల్లో ఎన్నో కొత్త భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో సరిహద్దుల్లో ఎదురువుతున్న సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొడుతూనే.. మరోవైపు భారత సైన్యాన్ని స్వయంసమృద్ధి (ఆత్మనిర్భర్) దిశగా నడిపించాల్సిన బరువైన బాధ్యత నూతన ఆర్మీ చీఫ్‌పై ఉంది. భవిష్యత్ యుద్ధతంత్రాలు, వ్యూహాత్మక ప్రణాళికలు, సైనిక సామర్థ్యాన్ని పెంచడంలో ఆయనకు ఉన్న అపార అనుభవం సైన్య ఆధునికీకరణకు ఎంతగానో ఉపయోగపడనుంది. గతంలో ఆయన ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో కీలక పదవుల్లో ఉన్నప్పుడు దళాల ఆధునికీకరణకు ఎన్నో ప్రణాళికలు రూపొందించారు.
**కఠిన భౌగోళిక ప్రాంతాల్లో విధులు.. అద్భుతమైన నాయకత్వం**
జనరల్ ధీరజ్ సేథ్ తన సుదీర్ఘ కెరీర్లో అడవులు, ఎడారులు, కొండ ప్రాంతాల వంటి ఎన్నో కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో పనిచేశారు. ఎడారి ప్రాంతంలో ఒక ఆర్మర్డ్ రెజిమెంట్‌కు, పశ్చిమ ప్రాంతంలో ఒక ఆర్మర్డ్ బ్రిగేడ్‌కు, జమ్మూకశ్మీర్‌లోని తీవ్రవాద నిరోధక దళానికి ఆయన విజయవంతంగా నాయకత్వం వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న వైస్ చీఫ్ కావడానికి ముందు ఆయన సదరన్ కమాండ్ హెడ్‌గా ఉన్న సమయంలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో సేథ్ నాయకత్వంలో సైన్యం అద్భుతంగా పనిచేసింది. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో సైన్యంలోని అత్యంత కీలకమైన ‘సుదర్శన్ చక్ర కార్ప్స్’కు హెడ్‌గా, దిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉంటూ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సైనిక కార్యక్రమాలను ఆయన సమర్థవంతంగా పర్యవేక్షించారు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో, భవిష్యత్ యుద్ధరంగ అవసరాలను ఎప్పటికప్పుడు సమన్వయం చేయడంలో జనరల్ సేథ్ దిట్ట అని రక్షణ మంత్రిత్వ శాఖ కొనియాడింది. వృత్తిపరమైన సైనిక విద్యాభ్యాసంలో ఆయన ఎప్పుడూ ముందంజలో ఉండేవారు. పలు శిక్షణా కోర్సుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఆయన.. హైయర్ కమాండ్ కోర్సు, నేషనల్ డిఫెన్స్ కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అంతేకాకుండా పారిస్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మక ‘కమాండ్ ఆఫ్ స్టాఫ్ కోర్సు’లో కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. ఇది సమకాలీన సైనిక వ్యూహాలపై ఆయనకున్న అపారమైన అవగాహనకు నిదర్శనమని రక్షణ శాఖ పేర్కొంది.








