Mahaa Daily Exclusive

  బీజేపీ నిశ్శబ్ద విప్లవం!

Share

  • బీజేపీ నిశ్శబ్ద విప్లవం!
  • ప్రతి సందర్భంపై నిశిత పరిశీలన
  • అధికార, ప్రతిపక్షాల మద్య వైరుధ్యాలే ఆయుధం
  • రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యం
  • పట్టణాల్లో పాగా, పల్లెల్లో బలనిరూపణ

హైదరాబాద్, మహా : రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ల మధ్య నిత్యం సాగుతున్న పరస్పర విమర్శలు, ధర్నాలు, అరెస్టుల రచ్చ ఒకవైపు నడుస్తుంటే. ఉత్తర తెలంగాణలో బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా సైలెంట్ ఆపరేషన్ సాగిస్తోంది. గతంలో తనకు పట్టున్న దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో కాషాయ దళం సరికొత్త హైపర్ లోకల్ వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తోంది. ఎలాంటి అర్బాటాలు, ప్రెస్ మీట్లు లేకుండా పల్లెల్లో నిశ్శబ్దంగా క్యాడర్ ను పెంచుకుంటూ, ఇతర పార్టీల అసంతృప్తులను లాక్కునే పనిలో పడింది. గ్రామాల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లొల్లి, ధరణి కమిటీల సెటిల్మెంట్లు, పోలీస్ కేసుల గొడవలను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ రెండు పార్టీల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న తటస్థ ఓటర్లను, ఏ పార్టీ వైపు వెళ్లాలో తెలియక సగటు గ్రామీణ వాసులను బీజేపీ నేతలు పలకరిస్తున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే పాత కక్షలు వస్తున్నాయి.. బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న మా వైపు వస్తే ఎలాంటి వేధింపులు ఉండవు అనే భరోసాతో స్థానిక యువతను, రైతు గ్రూపులను కాషాయం వైపు తిప్పుకుంటూ క్షేత్రస్థాయిలో రక్షణ కవచంలా మారుతున్నారు. ఈ సైలెంట్ ఆపరేషన్ లో భాగంగా బీజేపీ లీడర్లు గ్రామాల్లో ప్రభావం చూపగల మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ, గౌడ, ముదిరాజ్ వంటి బీసీ కుల సంఘాల పెద్దలతో పాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ఉపకులాల లీడర్లను టార్గెట్ చేశారు. ఊరిలో పది ఓట్లను అటు ఇటు తిప్పగల సత్తా ఉన్న ఈ పెద్దలను నేరుగా కలిసి సన్మానాలు చేయడం, వారి సామాజిక వర్గాల సమస్యలపై చర్చించడం వంటి పనులను ముమ్మరం చేశారు.

కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా

ప్రస్తుతానికి బీఆర్ఎస్ nu టార్గెట్ చేస్తున్నా. అంతిమంగా అధికార కాంగ్రెస్ ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. రేవంత్ సర్కార్ ఫై పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలంటే, ప్రజల గొంతుకగా నిలబడే ప్రధాన ప్రతిపక్షం తామేనని నిరూపించుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ స్థానాన్ని తాము భర్తీ చేస్తే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో నేరుగా ఢీకొనే అవకాశం దక్కుతుందని కమలనాధులు భావిస్తున్నారు. అందుకే, ముందుగా గులాబీ పార్టీని బలహీనపరిచి, ఆ తర్వాత కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాన్ని ఉదృతం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వార్ నడుస్తున్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఈ కుల సంఘాల మద్దతుతో గ్రామీణ ఓటు బ్యాంక్ ను పక్కాగా లాక్ చేసే సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ ను ఉత్తర తెలంగాణ పల్లెల్లో విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ హైపర్ లోకల్ గ్రౌండ్ వర్క్ అంతా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికే. పైకి సైలెంట్ గా కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో కుల సంఘాల అండ, తటస్థుల మద్దతు కూడగట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే ఉత్తర తెలంగాణలో కాషాయ జెండా ఊపును ఆపడం ఎవరితరం కాదనే ధీమాను బీజేపీ లీడర్లు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ వ్యూహాన్ని మరింత విస్తృతంగా అమలు చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో తెలంగాణ బీజేపీ కాస్త కంగారు పడుతున్నా.. సానుకూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విజయం సాధిస్తామన్న ధీమా తెలంగాణ బీజేపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నుంచి ఏ రోజైనా నోటిఫికేషన్ రావచ్చని కొందరు, అసలు ఇప్పట్లో ఉండక పోవచ్చని మరి కొందరు అంచనా వేస్తున్నారు. సర్ సర్వే ముగిసి కొత్త ఓటర్ లిస్ట్ వచ్చాక ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఇలా.. ఎవరి వాదనలు వారికి ఉన్నా, రాజకీయంగా పైచేయి సాధిస్తామన్న పట్టుదల మాత్రం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రేటర్ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండడంతో కమలం పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడు కార్పొరేషన్స్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం గనుక ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే.. ఇక ఆ తర్వాత పెద్దగా టైమ్ ఇవ్వదని, అందుకే ఇక నుంచి ఏ రోజు ప్రకటన వచ్చినా, తాము సిద్ధంగా ఉండాలనితెలంగాణ కమలనాథులు భావిస్తున్నారు. ఇలా రిజర్వేషన్స్ ప్రకటించి అలా ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే.. అభ్యర్థుల ఎంపిక ఇబ్బంది అవుతుందన్నది బీజేపీ భావన. అందుకే ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలు పెట్టారు.

ప్రధాన ప్రతిపక్షమే బీజేపీ తొలి లక్ష్యం..

తెలంగాణలో బీజేపీ మాస్టర్ ప్లాన్ ను పరిశీలిస్తే.. “టార్గెట్ బీఆర్ఎస్, అసలు గురి కాంగ్రెస్” అన్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో మారుతున్న సమీకరణాలను గమనిస్తున్న కమలం పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీని ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోయే పర్యటన తర్వాత గులాబీ పార్టీని రాజకీయంగా మరింత దెబ్బకొట్టడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలంటే, ముందుగా బలహీనపడిన బీఆర్ఎస్ ను పూర్తిగా ఖాళీ చేయడమే మార్గమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే, ప్రతిపక్ష స్థానాన్ని తాము అక్రమిస్తేనే భవిష్యత్తులో అధికారంలోకి రావడం సులభమని బీజేపీ అంచనా వేస్తోంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కీడరు తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఆ పార్టీ ఉనికిని తగ్గించాలని కమలదళం ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ ఎంత వీక్ అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతగా చీలదని, అది తమకు నేరుగా బాభిస్తుందని బీజేపీ సమాలోచనలు చేస్తోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్షన్ను మళ్లీ పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ మరో పర్యటన ఉంటుందని, ఆ తర్వాత రాష్ట్ర బీజేపీలో భారీ మార్పులు ఉంటాయని సంకేతాలు అందుతున్నాయి. మోడీ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ఆ పార్టీ కేడర్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తుండగా, మోడీ టూర్ ముగియగానే చేరికల పర్వం ఊపందుకోనుంది. బీఆర్ఎస్ నుంచి ప్రభావవంతమైన నేతలను ఆహ్వానించి, గులాబీ కోటను బద్దలు కొట్టడమే బీజేపీ తక్షణ కర్తవ్యంగా పనిచేస్తోంది.