కాంగ్రెస్‌లోకి శరద్ పవార్ పార్టీ?.
* విలీన చర్చలు తుది దశకు!**
* త్వరలోనే విలీన మార్గం సుగమం.
* ధ్రువీకరించిన కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్.
*పార్టీలో భిన్న స్వరాలు.. కొందరు ఎన్డీఏ వైపు, మరికొందరు హస్తం వైపు మొగ్గు.
* అజిత్ పవార్ మరణం తర్వాత మారిన మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు.
ఢిల్లీ, మహా.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన మార్పునకు తెరలేస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) పార్టీ.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో పాటు మమతా బెనర్జీ లాంటి ప్రాంతీయ నాయకులకు ఇటీవల కాలంలో ఎదురైన రాజకీయ పరిణామాలు, సొంత పార్టీల నుంచి కీలక నేతలు విడిపోయి ప్రత్యేక వర్గాలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో శరద్ పవార్ ఈ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానంతో శరద్ పవార్ పార్టీ విలీన చర్చలు అత్యంత సానుకూలంగా సాగుతున్నాయని, ఈ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని తెలుస్తోంది.
ఈ విలీన వార్తలపై మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విజయ్ వడెట్టివార్ స్పందిస్తూ ఓ జాతీయ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. శరద్ పవార్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యే అంశంపై చర్చలు నిజమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానంతో సంప్రదింపులు ముమ్మరంగా సాగుతున్నాయని ధ్రువీకరించారు. కాంగ్రెస్‌తో పాటు శరద్ పవార్ లౌకికవాద సిద్ధాంతాలను బలంగా విశ్వసించే నాయకులు, కార్యకర్తలకు తమ పార్టీలోకి ఎల్లప్పుడూ సాదర స్వాగతం ఉంటుందని విజయ్ వడెట్టివార్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ నాయకత్వం కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
**1999లో విడిపోయి.. ఇప్పుడు మళ్లీ?**
సోనియా గాంధీ విదేశీ పౌరసత్వ వివాదం నేపథ్యంలో 1999లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలం పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ ప్రాంతీయ పార్టీకి.. 2023లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ పెద్ద షాక్ ఇచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకుని మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే, మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత రెండు ఎన్సీపీ వర్గాలు మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 85 ఏళ్ల వయసున్న శరద్ పవార్.. తన వర్గం భవిష్యత్తు కోసం మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరడమే సరైన మార్గమని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
**ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్.. పార్టీలో భిన్నాభిప్రాయాలు!**
ఇదిలా ఉండగా, విలీన చర్చల నేపథ్యంలో శరద్ పవార్ పార్టీ భవిష్యత్తుపై నాయకుల్లో రెండు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు భోగట్టా. పార్టీలోని ఒక వర్గం ఎన్డీఏ కూటమిలో చేరడమే మేలని గట్టిగా వాదిస్తోంది. పార్టీకి ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ బలాన్ని బట్టి కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో మంచి భాగస్వామ్యం లభిస్తుందని ఆ వర్గం నేతలు భావిస్తున్నారు. నిరంతరం ప్రతిపక్షంలోనే కూర్చోవడం వల్ల రాష్ట్ర స్థాయిలో, అటు కేంద్ర స్థాయిలోనూ ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని, నియోజకవర్గ సమస్యల పరిష్కారం కూడా అత్యంత కష్టంగా మారిందని సదరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అజిత్ పవార్ బతికున్నప్పుడు కూడా.. పార్టీ రెండు వర్గాలు మళ్లీ కలిస్తే ఎన్డీఏ కూటమిలోనే కొనసాగాలని ఆయన కోరుకున్నారని ఆ వర్గం గుర్తు చేస్తోంది. ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ, స్వతంత్రంగా ఎన్డీఏలో చేరేందుకు తమకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని వారు వాదిస్తున్నారు. అయితే, శరద్ పవార్‌కు అత్యంత నమ్మకస్తులైన మరో వర్గం మాత్రం లౌకికవాద సిద్ధాంతాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం కావాలని పట్టుబడుతోంది. ఈ భిన్న స్వరాల మధ్య శరద్ పవార్ తీసుకునే తుది నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.








