ఐదు రోజులుగా మొరాయించిన రిజిస్ట్రేషన్ల వెబ్సైట్.
* తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు, న్యాయవాదులు.
* నిలిచిపోయిన స్టాంప్ పేపర్ల విక్రయాలు.
* కోర్టు పనులకు ఆటంకం.
* తక్షణమే సమస్యను పరిష్కరించాలని సర్వత్రా డిమాండ్.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్లు మొరాయించాయి. మెయింటెనెన్స్ (నిర్వహణ) పేరుతో గత ఐదు రోజులుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారిక వెబ్సైట్ పనిచేయకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ సాంకేతిక సమస్యల పుణ్యమా అని నిర్మానుష్యంగా మారాయి. ముఖ్యంగా అఫిడవిట్లు, అగ్రిమెంట్లు, న్యాయవాదులకు సంబంధించిన వివిధ కీలక దస్తావేజులు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలతో పాటు కోర్టు వ్యవహారాలకు అత్యంత అవసరమైన స్టాంప్ పేపర్లు సైతం అందుబాటులో లేకపోవడంతో అనేక పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
వెబ్సైట్ తెరుచుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా స్టాంప్ పేపర్ల అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో తమ పనుల నిమిత్తం వస్తున్న సాధారణ ప్రజలతో పాటు అడ్వకేట్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ విక్రేతలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. సైట్ ఎప్పుడు పునరుద్ధరిస్తారోనని ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజంతా పడిగాపులు కాస్తూ, చివరికి నిరాశతో వెనుదిరుగుతున్నారు. రాజధాని హైదరాబాద్లోని హైకోర్టు పరిసర ప్రాంతాలతో పాటు, రంగారెడ్డి కోర్టు, సిటీ సివిల్ కోర్టు తదితర కీలక ప్రాంతాల్లో ఈ సాంకేతిక సమస్య తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం అత్యవసరాలకు కూడా స్టాంప్ పేపర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక న్యాయపరమైన ప్రక్రియలు, కేసుల విచారణలు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ రోజుల్లో కేవలం ఒక్క గంటపాటు వెబ్సైట్ పనిచేయకపోయినా ప్రజలు, రియల్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఏకంగా వరుసగా ఐదు రోజులుగా వెబ్సైట్ పనిచేయకపోవడంతో ప్రజల సహనం కట్టలు తెంచుకుంటోంది. అధికారుల తీరుపై పలువురు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్తంభన ఇలాగే కొనసాగితే అటు ప్రజలకు ఇబ్బందులతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా కోట్లాది రూపాయల మేర భారీ ఆదాయ నష్టం కలిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టాంప్ విక్రేతలు కూడా రోజువారీ అమ్మకాలు లేక ఖాళీగా కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రజల ఆస్తులు, న్యాయపరమైన హక్కులతో ముడిపడి ఉన్న ఈ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాలను ప్రభుత్వం అత్యవసర సేవగా పరిగణించాల్సిన అవసరం ఉందని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, యుద్ధప్రాతిపదికన వెబ్సైట్ను పునరుద్ధరించాలని కోరుతున్నారు. అలాగే, భవిష్యత్తులో ఇటువంటి తీవ్రమైన సాంకేతిక సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా, సర్వర్ల సామర్థ్యాన్ని పెంచి పటిష్టమైన శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు, అడ్వకేట్లు, స్టాంప్ విక్రేతలు ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.








