- మాది ప్రజాపాలనే
- రేవంత్ డైనమిక్.. కేటీఆర్ అరెస్ట్ పక్కా
- బిజెపిలో బిఆర్ఎస్ విలీనం తథ్యం
- నిబద్ధతకు నిలువుటద్దం సీఎం రేవంత్
- నిర్ణయాల్లో వేగం.. పనుల్లో ముందు చూపు
- ఆలస్యమైనా అన్నీ చేస్తాం.. మళ్లీ వస్తాం
- పదేళ్ళలో 17వేల కోట్లు వారు మాఫీ చేశారు
- పదినెలల్లో 19వేల కోట్ల మాఫీ చేశాం
- విద్య, వైద్యం, క్రీడలే మా ప్రాధాన్యతలు
- తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ కేబినెట్ ఇదే
మహా పత్రిక – ఏఎన్ ఎన్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ బ్యూరో, మహా: కేటీఆర్ తొందరపడుతున్నాడు. పద్దతి ప్రకారం చట్టపరిధిలోనే ఆయన అనుకున్న అరెస్ట్ పక్కాఅవుతుంది. బిజెపిలో బిఆర్ఎస్ పార్టీ విలీనం తథ్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతిహామీ నెరవేరుస్తాం.. మళ్ళీ వస్తాం. పదకొండు మాసాల్లో ప్రజాపాలన అందించాం. పదేళ్ళ సంకెళ్ళు తొలగించాం. అందరూ స్వేచ్చగా పనిచేసుకునే వాతావరణం తీసుకొచ్చాం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహా పత్రిక- ఎఎన్ఎన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన రాష్ట్ర రాజకీయాలపై, తెలంగాణ ప్రభుత్వ తీరుపై అనేక అంశాలపై స్పష్టతనిచ్చారు.
మహా: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఎలా ఉంది? మీరు చెప్పిన మార్పు తీసుకొచ్చారా?
టిపిసిసి చీఫ్: వందశాతం మార్పు తీసుకొచ్చాం. పదేళ్ళ సంకెళ్ళను తెంచి స్వేచ్చాయుత వాతావరణం తీసుకొచ్చాం. గతంలో కేసీఆర్ మా కుటుంబం బాగుంటే చాలు.. అని ప్రజల బాగు పట్టించుకోలేదు. బంగారు తెలంగాణ అన్నాడు. ఏ ఇల్లు బంగారం కాలేదు.. ఒక్క కేసీఆర్ ఇల్లు తప్ప. అధికారం ఎక్కడికక్కడ కేంద్రీకృతం చేశారు. పదేళ్ళలో చేయలేని పనులు 11మాసాల్లోనే చేశాం. పదేళ్ళలో ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు. 11మాసాల్లోనే 55వేల ఉద్యోగాలు ఇచ్చాం. మాకు నిరుద్యోగుల నియామకాలు ముఖ్యం. కేసీఆర్ కు వాళ్ళింట్లో నియామకాలు ముఖ్యం.
మహా: రైతుబంధు లాంటి గత పథకాలు కొనసాగించడం లేదన్న విమర్శలున్నాయి?
టిపిసిసి చీఫ్: రైతులకు ఈ పదకొండు మాసాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినంతగా గత ప్రభుత్వం చేయలేదు. గత ప్రభుత్వం పదేళ్ళలో 17వేల కోట్ల రుణమాఫీ చేస్తే పదిమాసాలు తిరగకముందే 19వేల కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర మా ముఖ్యమంత్రిది. రైతుబంధు కూడా ఒక పంటకు వేశాం. మరో పంటకు కాస్త అటు ఇటు పడుతుంది. ఆర్ధిక ఇబ్బందులున్నా రైతుసంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రైతుభరోసా ను అమలుచేస్తాం. రుణమాఫీ ఎక్కడైనా రానివారుంటే పూర్తిచేస్తాం.
మహా: లగచర్ల ఘటనలో ఎవరిది వైఫల్యం?
టిపిసిసి చీఫ్: లగచర్ల ఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదు. ప్రతిపక్షాలు కొన్ని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. పరిశ్రమలు హైదరాబాద్ కే పరిమితం కావొద్దని, వికేంద్రీకరించబడాలన్నది ప్రభుత్వ విధానం. గత ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క దీనిపై నిలదీశారు. ఇపుడు మా ప్రభుత్వం వచ్చాక వెనుకబడిన కొడంగల్ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటుచేయాలనుకోవడం తప్పా? బిఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో తెలియక అధికారులపై కూడా దాడులకు తెగబడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిపద్దతి కాదు.
మహా: దమ్ముంటే అరెస్ట్ చేస్కో అని బిఆర్ఎస్ నేత కేటీఆర్ సవాళ్ళు విసురుతున్నారు. నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా?
టిపిసిసి చీఫ్: కేటీఆర్ అరెస్ట్ కావడం పక్కా. ఆయన ఒకటీ, రెండు కాదు ఎన్నో నేరాలు ఘోరాలు చేశాడు. ఫోన్ ట్యాపింగ్ లోనో, ఈ రేస్ లోనో ఎందులో ముందు అరెస్ట్ అవుతాడో తెలియదు. ప్రభుత్వ ధనాన్ని పప్పు బెల్లంలా రూ.55కోట్లు పంచేస్తే ఏ నిబంధనలు అంగీకరిస్తాయి? కేటీఆర్ కోరుకుంటే అరెస్ట్ చేయం. మాది ప్రజాప్రభుత్వం. చట్టపరిధిలో పద్దతి ప్రకారం అన్నీ చేస్తం. ఈరేస్ పై గవర్నర్ కు నివేదించాం. ఆయన అనుమతిస్తే అరెస్ట్ అవుతారు.
మహా: ముఖ్యమంత్రిపై పరుషపదజాలంతో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూస్తారు?
టిపిసిసి చీఫ్: కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్చ తీసుకురావడం వల్లే కేటీఆర్ లాంటి వాళ్ళు ఇలా దుష్ప్రచారాలు, దుర్మార్గపు మాటలు కూడా స్వేచ్చగా మాట్లాడుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని, ముఖ్యమంత్రి గారిపై దుర్షాషలు, పిచ్చి ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్ నేర్పిన సంస్కారం అది. ప్రజలు వీటిని విశ్వసించరు.
మహా: మంత్రివర్గ విస్తరణ ఎపుడు ఉంటుంది?
టిపిసిసి చీఫ్: అది ముఖ్యమంత్రి పరిధిలోని అంశం. సమయం సందర్భం బట్టి ఉంటుంది. ముఖ్యమంత్రికి విద్య, వైద్యం, క్రీడలు ప్రాధాన్యత అంశాలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. హైదరాబాద్ పై మూసీ ప్రక్షాళన ద్వారా చరిత్రలో ఎవరూ వేయని ముద్ర వేయాలనుకుంటున్నారు. మూసీ ప్రక్షాళన చేయడం తథ్యం.
మహా: మూసీపై బిజెపి యాత్రలు చేస్తోంది. ప్రక్షాళనకు అనుకూలమంటూనే ఇళ్ళను ఖాళీచేయించవద్దంటోంది?
టిపిసిసి చీఫ్: ప్రతీ విషయంలోనూ బిజెపిది డబుల్ స్టాండే. ఏది క్లియర్ గా ఉండరు. గల్లీలో ఓ మాట.. ఢిల్లీలో ఓ మాట.
మహా: బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని అందుకే గత పాలకులపై చర్యలు తీసుకోవడం లేదని బిజెపి విమర్శిస్తోంది?
టిపిసిసి చీఫ్: గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలుసు. బిజెపి బిఆర్ఎస్ ఒక్కటేనని. ప్రతీ బిల్లులో తొమ్మిదేళ్ళపాటు వారికి బిఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఇప్పటికీ వారి అనుబంధం కొనసాగుతోంది. ఢిల్లీకి వెళ్తే కేటీఆర్ కు అపాయింట్ మెంట్లు దొరుకుతున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల్లోపే బిజెపిలో బిఆర్ఎస్ విలీనం తథ్యం. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్, బిజెపి మధ్యే.
మహా: పిసిసి చీఫ్ గా రెండుమాసాల్లోనే బలమైన ముద్ర వేశారు. మంత్రులతో ముఖాముఖి ఆలోచన ఎలా వచ్చింది?
టిపిసిసి చీఫ్: పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది. అధికారంలో ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అందుకే ముఖ్యమంత్రి, మంత్రుల సహకారంతో పార్టీకి ప్రభుత్వానికి అనుసంధాన కార్యక్రమం నిర్వహించాం. దీనికి మంచి స్పందన వస్తోంది.
మహా: జిల్లాల సమీక్షలు చేశారు. జిల్లాల పర్యటనలు ఉండబోతున్నాయా?
టిపిసిసి చీఫ్: వరంగల్ నుండి జిల్లాల పర్యటన ప్రారంభమవుతుంది. ప్రజాప్రభుత్వ పాలన విజయాలను చాటుతూ, క్యాడర్ ను భాగస్వాములను చేస్తూ పర్యటనలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉత్తర తెలంగాణలో కూడా బలపడ్డాం. స్థానిక ఎన్నికల్లో మంచి విజయాలు సాధిస్తాం.
మహా: ముఖ్యమంత్రి పాలనా తీరును ఎలా చూస్తారు?
టిపిసిసి చీఫ్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్, ఇలాంటి అద్భుత నాయకుడు దొరకడం అద్రుష్టం. ఏ నిర్ణయమైనా వేగంగా తీసుకుంటాడు. ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కుపోడు. తాజాగా బిసి కమిషన్ పై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్ కు వెళ్తామని కొందరు సూచిస్తే ఎందుకు వెళ్ళాలి. మనం బిసిల విషయంలో చిత్తశుద్దితో ఉన్నాం.. బేషజాల్లేకుండా నియమిద్దాం అంటూ పదినిమిషాల్లో అంశాన్ని తేల్చారు. ఇలా ఎన్నో. నిబద్దతకు నిలువుటద్దం రేవంత్ రెడ్డి. ఎన్నో సవాళ్ళున్నా.. నిరంతరం పనిచేస్తూ స్ఫూర్తి నింపుతారు.
మహా: మీ కేబినెట్ లో మంత్రులకు ర్యాంకులు ఇవ్వాల్సి వస్తే?
టిపిసిసి చీఫ్: రాష్ట్రంలో ఇదే బెస్ట్ కేబినెట్. అత్యుత్తమ నాయకులు మంత్రులుగా ఉన్నారు. నిజాయితీగా నిరంతరం పనిచేస్తూ ఆయా రంగాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. మంచి ప్రభుత్వం ఉంది. ప్రజలు కోరుకున్న ప్రభుత్వమిది. సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వం. దీనికి ప్రజలు అండగా ఉండాలి.