- జైలే కావాలి
– ట్రెండింగ్ గా మారుతున్న జైలు జీవితం
– జైలుకు వెళ్తేనే పెద్ద లీడరవుతామనే ధోరణి
– రెస్ట్ దొరుకుతుందనే ఆలోచనలో మరికొందరు
హైదరాబాద్, మహా: రాజకీయ నేతగా ఏ వ్యక్తి అయినా ఎదగాలి అంటే ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురుకోక తప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారికి రెస్ట్ అనే మాటనే ఉండదు. రోజంతా అంటే 24 గంటలూ పని చేయాల్సి ఉంటుంది. ఏ ఒక్క క్షణం తీరిక ఉండదు. మిగతావారికి, వీరికి చాలా తేడా ఉంటుంది. ఏదైనా ఉద్యోగం, వ్యాపారం, ఇతర రంగాల వారికి రెస్ట్ దొరకుతుందేమో కానీ, రాజకీయ నాయకులు మాత్రం రెస్ట్ అనే మాటకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. నిత్యం ప్రజలు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధితోపాటు ఇతర కార్యక్రమాలు… ఇలా ఒక్కటనే కాదు ఎన్నో విషయాలతో నిత్యం ప్రయాణం చేయాల్సి ఉంటుంది వారి రాజకీయ జీవితంలో. అందుకే వారు ఎప్పుడు చూసినా బిజీ బిజీగా ఉంటారు. ఏ వ్యక్తి అయినా రాజకీయ నేతగా ఎదగాలంటే ప్రణాళికలు చేసుకోవాలి. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలి. అలా వెళ్తున్న రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు ఉంటుంది. వారిని ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, రాజకీయ నాయకులుగా రాణించాలంటే ముఖ్యంగా ప్రత్యర్థులకు ధీటుగా పని చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్లు, ఇతర విషయాల్లో గానీ వారిని ఓడగొట్టేందుకు ఎంతో వ్యూహాత్మకంగా పని చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో లక్షణాలను కూడా రాజకీయ నాయకులు కలిగి ఉండాలి. అప్పుడే వారు రాణించగలుగుతారు… రాజకీయంలో ది బెస్ట్ లీడర్ గా ఎదగగలుగుతారు.
ఇదంతా ఒక విధానం అయితే, ప్రస్తుత రోజుల్లో ఓ ట్రెండ్ రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది. నేరాలకు పాల్పడినవారికి జైలు జీవితం గడుపుతుంటారు. అది ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేర తీవ్రతను బట్టి వారికి జైలు శిక్ష కోర్టు విధిస్తుంది. జైలుకు పోయివచ్చిన వారిని కదిలిస్తే.. మళ్లెప్పుడూ నేరం చేయొద్దు.. జైలుకు పోవొద్దనే మార్పు వారిలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే జైలుకు పోయి వచ్చిన చాలామంది ఆ తరువాత స్తబ్ధుగా కొనసాగించేందుకు ఇష్టపడుతుంటారు. కానీ, జైలు జీవితం రాజకీయ నాయకులకు ప్రజెంట్ బాగా కలిసి వస్తోంది. దీంతో జైలుకు వెళ్లొచ్చిన పలువురు నాయకులు వారి రాజకీయ జీవితంలో అదొక భాగంగా పరిగణిస్తున్నారు. ఒగప్పుడు కేసులు, జైలులు అంటే ఎంతో భయపడేది. గత నాయకులను ఓసారి పరిశీలిస్తే వారికి నేర చరిత్ర లేదా కేసులు, జైలు జీవితం అనే ముచ్చట చాలా రేర్. కానీ, అలా కాకుండా ఇప్పుడైతే చాలామంది నాయకుల్లో ఆ భయమే కనిపిస్తలేదు. జైలుకు వెళ్లేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. చాలామంది నాయకులపై ఎన్నో కేసులు ఉన్నాయి. వారంతా కూడా వాటిని గౌరవ డాక్టరేట్లుగా భావిస్తున్నారు. నాయకులు జైలుకు పోయి వచ్చిన ప్రజల్లో సింపతి పెరిగి ఎన్నికల్లో గెలవడం, లేదా జనంలో గుర్తింపు రావడం జరుగుతుంది. పలువురు నాయకులను ఓసారి పరిశీలిస్తే ఇదే అంశం అర్థమవుతుంది. రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ అవుతుంది.
చాలామంది నేతలకు జైలు జీవితం చాలా కలిసి వచ్చింది. వారు జైలుకు వెళ్లొచ్చిన తరువాత చిన్న నాయకుల నుంచి పెద్ద నేతలుగా ఎదిగారు. ప్రజల్లో కూడా వారికి సానుభూతి కలిసొచ్చింది. దీంతో రాజకీయ మనుగడ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోయింది. కొంతమంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అయిన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొందరి నేతలపైనే కేసుల వివరాలు చూస్తే ఏకంగా వంద దాటిన వారు కూడా ఉన్నారు. అయినా అవొక డిగ్రీల్లా ఫీలవుతున్నారు. వాటి వల్లే తాము ఈ స్థాయికి వచ్చామనే ధోరణిలో గౌరవంగా ఫీలవుతున్నారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పేరున్న చాలామంది ప్రజాప్రతినిధుల తీరు కూడా ఇదే స్టైల్ లా కనిపిస్తుందంటా. జైలుకు వెళ్లి వస్తేనే తదుపరి రాజకీయ జీవితం ఇంకా బాగుంటుందనే ధోరణి కనిపిస్తుందంటా. అందుకే నేతలు ప్రజెంట్ జైలుకు వెళ్లేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారంటా. కేసులు ఏమైనా గానీ, జైలుకు వెళ్లొస్తేనే మంత్రులు, ముఖ్యమంత్రలం అవ్వగలమనే భావనలో ఉన్నారంటా.
ఏదైనా కేసుల్లో నేతలు జైలుకు వెళ్లినప్పుడు వారి అనుచరులు, కార్యకర్తల రాస్తారోకోలు, బంద్ లు.. ఇలా పలు నిరసన కార్యక్రమాలు చేస్తుండడం, వారు జైలు నుంచి విడుదలైనప్పుడు కూడా ర్యాలీలు, ఊరేగింపులతో నానా హంగామా చేస్తుండడం కూడా వారికి బాగానే కలిసివస్తుంది. ఇది జనాల నోళ్లల్లో ఆ నేతల పేర్లు ఆడడానికి ఓ కారణమవుతుంది. మరోవైపు జైలుకు వెళ్లొచ్చిన తరువాత వారి ఆగ్రహ ప్రసంగాలు కూడా ఒక కారణమవుతున్నాయి. జనాలు కూడా తప్పు ఒప్పును పక్కనపెట్టి వారిపై సింపతినే ప్రదర్శిస్తున్నారు. ఈ సెంటిమెంట్ చాలా కలిసివస్తుందంటా. వారికి పదవుల పరంపర కొనసాగుతుందంటా. ఈ క్రమంలోనే నేతలు జైలుకు వెళ్లేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారంటా. వారు జైలుకు వెళ్లినా అక్కడ వారికి రాచమర్యాదలు ఉంటాయని ప్రజలు అనుకుంటున్నారు. వీరికి, మీగతా ఖైదీలకు మధ్య తేడా చాలా ఉంటుందనే అనుకుంటున్నారు. వారన్నట్టుగానే ఎన్నో ఉదాహరణలను చూసి ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ట్రెండ్ ను పలువురు నేతలు ఫాలో అయ్యేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.