ఓ వివాదం విషయమై అప్పటి అదనపు ఎస్పీ తిరుపతన్నకు తాను రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చానని… ఆ నెంబర్లను ట్యాపింగ్ చేసిన సంగతి తనకు తెలియదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత జైపాల్ యాదవ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు విచారించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓ వివాదం పరిష్కారం కోసం తాను తిరుపతన్నను కలిశానని తెలిపారు. ఆయన కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వాడేనని, అందుకే కలిసినట్లు చెప్పారు. రెండు కుటుంబాల మధ్య విభేదాల నేపథ్యంలో వారి ఇద్దరి నెంబర్లు తాను తిరుపతన్నకు ఇచ్చానని వెల్లడించారు.
తిరుపతన్న ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, ఆ రెండు ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసిన విషయం తనకైతే తెలియదన్నారు. పోలీసులు తన ముందు కొన్ని ఆధారాలు పెట్టి వివరణ అడిగారని, వారికి సమాధానం చెప్పానన్నారు. ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిచినా తాను సహకరిస్తానన్నారు.