Mahaa Daily Exclusive

  రేవంత్ కేబినెట్ విస్తరణ పై ఢిల్లీ బిగ్ అప్డేట్..! 11 నెలలుగా నిరీక్షణ..

Share

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు. ముఖ్యమంత్రిగా రేవంత్ పగ్గాలు చేపట్టి మరి కొద్ది రోజుల్లో ఏడాది పూర్తవుతుంది. బాధ్యతల స్వీకరణ సమయం నుంచి ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ పైన పలు మార్లు చర్చలు జరిగాయి. అనేక మంది పేర్లు రేసులోకి వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఇంకా స్పష్టత లేదు. అయితే, ఏడాది పాలన ఉత్సవాలకు సిద్దం అవుతున్న క్రమంలో మంత్రివర్గ విస్తరణ పైన ఏఐసీసీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

ఏడాది పూర్తవుతున్న వేళ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి కొద్ది రోజుల్లో సంవత్సరం పూర్తవుతుంది. తమ ప్రభుత్వ విజయోత్సవాలు నిర్వహించుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇదే సమయంలో మంత్రివర్గంలో స్థానం కోసం ఆశలు పెట్టుకున్న నేతలు ఏడాది కాలంగా నిరీక్షిస్తూనే ఉన్నారు. రేవంత్ మంత్రివర్గంలో ఆరు స్థానాలు భర్తీకి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన మూడో నెల నుంచి విస్తరణ గురించి చర్చలు జరుగుతున్నాయి. పలువురికి బెర్తులు ఖాయమని పార్టీ నేతలు అంచనాలు వేసారు. కానీ, ఇప్పటి వరకు విస్తరణ జరగలేదు.

 

11 నెలలుగా నిరీక్షణ

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ ఇప్పటి వరకు 24 సార్లు ఢిల్లీకి వెళ్లారు. పలువురు మంత్రివర్గ ఆశావాహులు సైతం ఢిల్లీలో లాబీయింగ్ చేసారు. కొందరికి పదవుల పైన హామీ దక్కింది. సామాజిక – ప్రాంతీయ సమీకరణాలతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను నియమించిన సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ ఇక వెంటనే ఉంటుందనే సంకేతాలు వచ్చాయి. కానీ, పార్టీ అధినాయకత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు అయిన 11 రోజులకే మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ అనుమతి ఇచ్చింది. కానీ, తెలంగాణలో మాత్రం ఇవ్వకపోవటం పైన చర్చ మొదలైంది.

 

ఈ నెలాఖరు లోగా

ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్‌లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలామంది నేతలు భావించారు. కానీ పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తయి ఆరు నెలలు గడించింది. ఇప్పుడు ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న వేళ మంత్రివర్గ విస్తరణ పైన మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం రేవంత్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ కు ఈ నెల 20న ఎన్నికలు.. 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. ఇప్పటికే ఈ మేరకు తాజా ఢిల్లీ పర్యటనలో రేవంత్ అనుమతి తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో.. ఈ నెల చివరి వారంలో మంత్రివర్గ విస్తరణ పైన పార్టీ నేతలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. దీంతో, ఈ సారైనా విస్తరణ ఉంటుందా లేదా అనేది ఉత్కంఠ పెంచుతోంది